Begin typing your search above and press return to search.

'రాకాస' మూవీ రివ్యూ

‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది నిహారిక కొణిదెల. ఇప్పుడామె మానస శర్మను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం.. రాకాస.

By:  Tupaki Desk   |   3 April 2026 12:09 PM IST
రాకాస మూవీ రివ్యూ
X

నటీనటులు: సంగీత్ శోభన్- నయన్ సారిక- వెన్నెల కిషోర్- గెటప్ శీను- తనికెళ్ళ భరణి- ఆశిష్ విద్యార్థి-అన్నపూర్ణమ్మ తదితరులు

సంగీతం: అనుదీప్ దేవ్

ఛాయాగ్రహణం: రాజు ఎదురోలు

నిర్మాతలు: నిహారిక కొణిదెల- ఉమేష్ కుమార్ బన్సల్

రచన-దర్శకత్వం: మానస శర్మ

‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది నిహారిక కొణిదెల. ఇప్పుడామె మానస శర్మను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం.. రాకాస. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది? తెలుసుకుందాం పదండి.

కథ: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్ వీరూ (సంగీత్ శోభన్).. తన చిన్ననాటి స్నేహితురాలైన సుబ్బలక్ష్మి (నయన్ సారిక)ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో తన సొంత ఊరికి వస్తాడు. కానీ అక్కడ ఆమె వేరే వ్యక్తితో పెళ్లికి రెడీ అయి ఉంటుంది. ఈ పెళ్లిని ఆపడానికి ప్రయత్నించే క్రమంలో వీరూ చిక్కుల్లో పడతాడు. ఆ ఊరికి ఆనుకుని ఉన్న కోటలో ఎన్నో దశాబ్దాలుగా తిష్ట వేసుకుని కూర్చున్న రాక్షసుడికి బలిగా వెళ్లాల్సిన స్థితికి చేరుకుంటాడు వీరూ. మరి బలి కోసం కోటలోకి అడుగు పెట్టిన వీరూకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. అక్కడ నిజంగానే రాక్షసుడున్నాడా.. తన కథేంటి.. బలి కోసం వెళ్లిన వీరూ ప్రాణాలు దక్కించుకోగలిగాడా.. మళ్లీ సుబ్బలక్ష్మిని కలవగలిగాడా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: కామెడీ సినిమా అంటే చాలు.. కథ విషయంలో ఎక్కువ బుర్ర చించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు చాలామంది ఫిలిం మేకర్స్. ప్రేక్షకులు కూడా కథను పెద్దగా పట్టించుకోరు అనే ఉద్దేశంతో తేలిగ్గా వ్యవహారం నడిపించేస్తుంటారు. కానీ కథ పకడ్బందీగా ఉంటే కామెడీ కూడా వేరే స్థాయికి వెళ్తుందనే విషయాన్ని గుర్తించరు. ‘రాకాస’లో టీజర్.. ట్రైలర్ చూసి.. ఇది జస్ట్ ఒక సగటు కామెడీ సినిమా కాదని.. ప్రేక్షకులను ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి నవ్వించబోతున్నారనే ఆశలు కలిగాయి. ఆ ప్రపంచం మరీ కొత్తదేమీ కాకపోయినా.. సగటు కామెడీ సినిమాల్లో చూడని విశేషాలతో కూడుకున్నదే. కాకపోతే నాన్ సీరియస్ గా.. కొంచెం సిల్లీగా కథను నడిపించడం వల్ల ‘రాకాస’ మరీ తేలికైపోయింది. అలా అని ఇందులో నవ్వులకేమీ ఢోకా లేదు. ‘మ్యాడ్’ ఫ్రాంఛైజీతో భలేగా నవ్వించిన సంగీత్ శోభన్ మరోసారి తనదైన శైలిలో చేసిన అల్లరికి.. వెన్నెల కిషోర్-గెటప్ శీనుల కామెడీ టైమింగ్.. కామెడీ సిచువేషన్లు-పంచులు కూడా తోడవడంతో ‘రాకాస’లో నవ్వుల కాలక్షేపానికేమీ లోటు లేకపోయింది. కానీ లాజిక్కుల్లేకుండా మరీ తేలిగ్గా.. చాలా కన్వీనియెంటుగా సాగిపోయే కథాకథనాలు మాత్రం ‘రాకాస’ ప్రభావాన్ని తగ్గించేశాయి. టైంపాస్ చేయించే కామెడీ కోసమైతే ‘రాకాస’ మీద ఒక లుక్కేయొచ్చు.

విలన్ ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత బాగా ఎలివేట్ అయినట్లుగా.. హార్రర్ లేదా హార్రర్ కామెడీ చిత్రాల్లో దయ్యం ఎంత ప్రమాదకరం అనిపిస్తే.. అంత భయం కలుగుతుంది. ఆ భయం నుంచే నవ్వులు కూడా పుడతాయి. ఐతే ‘రాకాస’లో ఊరు.. దాన్ని ఆనుకుని ఉండే కోట.. అందులో ఒక రాక్షసుడు.. అతడి వల్ల ఊరికి శాపం.. ఊరి నుంచి ఒకరు నరబలికి వెళ్లాల్సిన కట్టుబాటు.. అనుకోకుండా హీరో ఆ కట్టుబాటులో భాగంగా బలికి వెళ్లి కోటలో ఇరుక్కుని రాక్షసుడితో చేసే పోరాటం.. ఈ నేపథ్యంలో ఇలా పేపర్ మీద ఇంట్రెస్టింగ్ సెటప్పే రాసుకుంది మానస శర్మ. కానీ దీన్ని తెరపైన ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం అంత పకడ్బందీగా లేదు. రాక్షసుడిని చూస్తే ఏ దశలోనూ భయం పుట్టకపోవడం.. కోటలో హీరో అండ్ కో ఇరుక్కుపోయినా ఉత్కంఠ కలగకపోవడం.. చిక్కుముడులు బలంగా లేకపోవడం.. వాటిని విప్పే తీరు కూడా చాలా సాధారణంగా సాగిపోవడంతో ‘రాకాస’ను ఏ దశలోనూ సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. దయ్యాలతో సహవాసంలో రవ్వంతయినా టెన్షన్-ఫియర్ పుట్టని పరిస్థితి ఉంటే.. ఆ సినిమా వేసే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

కానీ కథాకథనాల పరంగా ఎన్ని లోపాలున్నప్పటికీ.. ‘రాకాస’లో నవ్వులకైతే లోటు లేదు. సంగీత్ శోభన్.. వెన్నెల కిషోర్.. గెటప్ శీను.. ఈ ముగ్గురూ కనిపించిన ప్రతిసారీ నాన్ స్టాప్ పంచులతో ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వు చెరగనీయకుండా చూశారు. ప్రథమార్ధమంతా గెటప్ శీను సహకారంతో నవ్వించిన సంగీత్ కు.. రెండో అర్ధంలో వెన్నెల కిషోర్ కూడా తోడయ్యాడు. కోట లోపల ఈ ముగ్గురూ కలిసి చేసిన అల్లరి సినిమాకు మేజర్ హైలైట్. ప్రథమార్ధంలో ఊరిలో జరిగే విషయాలు కొంత ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఐతే ఊరి శాపం గురించి అర్థమయ్యేలా.. ప్రభావవంతంగా చెప్పలేకపోవడం వల్ల మధ్యలోనే కథ బలహీన పడిపోయింది. తర్వాత కోట లోపల రాక్షసుడి పాత్రను ప్రెజెంట్ చేసిన విధానంతో ‘రాకాస’ మరింత తేలికగా మారింది. ఐతే ప్రతి సన్నివేశంలోనూ నవ్వించాలన్న లక్ష్యం మాత్రం చాలా వరకు నెరవేరింది. రాక్షసుడికి సంబంధించిన ఎమోషనల్ యాంగిల్ సినిమాలో మరో ప్లస్ పాయింట్. సినిమాలో అదే బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. మొత్తం కథను ఇంతే ప్రభావవంతంగా తీర్చిదిద్ది ఉంటే ‘రాకాస’ సినిమా స్థాయి వేరుగా ఉండేది. కేవలం కాలక్షేపం.. కొన్ని నవ్వుల కోసమైతే ‘రాకాస’ను ట్రై చేసి చూడొచ్చు.

నటీనటులు: సంగీత్ శోభన్ మరోసారి కామెడీలో తన బలాన్ని చూపించాడు. ఇతనుంటే మినిమం నవ్వులుంటాయి అనే నమ్మకాన్ని నిలబెడుతూ సంగీత్.. మామూలు సన్నివేశాల్లో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పంచాడు. ఫాంలో ఉన్నపుడు అల్లరి నరేష్ ఏం చేసినా ఎలా నవ్వొచ్చేదో.. ఇప్పుడు సంగీత్ సైతం అలా ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు తీసుకురాగలుగుతున్నాడు. ఈ తరం యువతకు తన పంచులు బాగా నచ్చుతాయి. హీరోయిన్ నయన్ సారిక కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ అనగానే ఏదో మొక్కుబడి పాత్ర ఇవ్వకుండా.. కథలో కీలకంగా ఉండేలా తన పాత్రను తీర్చిదిద్దింది దర్శకురాలు మానస. సారిక కూడా ఆ పాత్రకు న్యాయం చేస్తూ చక్కటి నటనతో మెప్పించింది. వెన్నెల కిషోర్.. గెటప్ శీను బాగానే నవ్వించారు. తనికెళ్ళ భరణి తన అనుభవం చూపించారు. ఆశిష్ విద్యార్థి గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు. అన్నపూర్ణమ్మ.. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక వర్గం: చిన్న సినిమా అయినప్పటికీ.. సాంకేతికంగా ‘రాకాస’ బాగుంది. ఒక చిన్న స్థాయి కామెడీ సినిమాకు మించిన నిర్మాణ విలువలు చూపించారు. పరిమిత బడ్జెట్లోనే సెట్స్.. వీఎఫెక్స్ బాగా తీర్చిదిద్దారు. అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. రాక్షసుడిలో ఎమోషనల్ చూపించే సన్నివేశాల్లో వచ్చే బిట్ సాంగ్.. బీజీఎం హృద్యంగా సాగాయి. మిగతా పాటలు పర్వాలేదు. రాజు ఎదురోలు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. మానస శర్మ కథ అంత గొప్పగా లేదు. అలా అని తీసిపడేసేలా కూడా లేదు. కథలో చాలా విషయాలు సిల్లీగా.. హడావుడిగా అనిపిస్తాయి. అన్నీ కన్వీనియెంట్ గా సాగిపోవడం.. ఏదీ సీరియస్ గా తీసుకునేలా లేకపోవడం బలహీనతే. కానీ ఈ లోపాలను మన్నించవచ్చు అనిపించేలా కామెడీ అయితే పండించగలిగింది మానస. ఆమె టేకింగ్ ట్రెండీగా అనిపిస్తుంది.

చివరగా: రాకాస.. కొన్ని నవ్వుల కోసం

రేటింగ్-2.75/5