Begin typing your search above and press return to search.

వీరమల్లు 2 అప్‌డేట్‌ ఇచ్చిన అందాల 'పంచమి'

జ్యోతికృష్ణకు తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపు లేదు. అందుకే ఆయన మీడియా ముందుకు వచ్చినా పెద్దగా బజ్ క్రియేట్‌ కావడం లేదు.

By:  Tupaki Desk   |   15 July 2025 12:24 PM IST
వీరమల్లు 2 అప్‌డేట్‌ ఇచ్చిన అందాల పంచమి
X

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం 'హరి హర వీరమల్లు'. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను జులై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. హీరో పవన్‌ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నాడు. దాంతో ఆయన ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరు అవుతాడు అనే నమ్మకం లేదు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను మధ్యలో వదిలేసి వెళ్లి పోయాడు. దాంతో ఆయన కూడా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరు అయ్యే అవకాశాలు లేవని చెప్పాలి. దర్శకుడు జ్యోతికృష్ణ ప్రమోషన్స్ కార్యక్రమాలకు హాజరు అవుతున్నా కూడా పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేక పోతున్నాడు.

జ్యోతికృష్ణకు తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపు లేదు. అందుకే ఆయన మీడియా ముందుకు వచ్చినా పెద్దగా బజ్ క్రియేట్‌ కావడం లేదు. దాంతో మొత్తం ప్రమోషన్స్‌ బాధ్యత హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ మీద పడింది. హరి హర వీరమల్లు సినిమాలో పంచమి పాత్రలో నటించిన నిధి అగర్వాల్‌ లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా కోసం నిధి అగర్వాల్‌ దాదాపుగా రెండు మూడు ఏళ్లుగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో బిజీ అవ్వచ్చు అని ఈమె చాలా నమ్మకంగా ఎదురు చూస్తుంది. అందుకే వీరమల్లు సినిమా ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా కూడా నిధి అగర్వాల్‌ అక్కడ ఉంటుంది.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరమల్లు గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అదే సమయంలో ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పని వీరమల్లు 2 సినిమాకు సంబంధించిన ముచ్చట్లను కూడా నిధి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది. వీరమల్లు సినిమాను మొదట సింగిల్‌ పార్ట్‌గానే అనుకున్నారు. కానీ కథ పెద్దగా ఉండటంతో పాటు, మరికొన్ని విషయాల కారణంగా సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేయాలని నిర్ణయించారు. మొదటి పార్ట్‌తో పాటు రెండో పార్ట్‌ షూటింగ్‌ చేస్తారని అంతా భావించారు. కానీ రెండో పార్ట్‌ షూటింగ్‌ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే 20 నిమిషాల సీన్స్‌కు సంబంధించిన షూట్‌ చేసినట్లు నిధి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది.

నిధి అగర్వాల్‌ చెప్పిన మాటల ప్రకారం వీరమల్లు పార్ట్‌ 2 లోనూ ఆమె ఉంటుంది. అంతే కాకుండా మరింత పవర్‌ ఫుల్‌గా వీరమల్లు 2 ఉంటుందని తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్ రాజకీయాలు, పరిపాలనతో చాలా బిజీగా ఉన్నాడు. దాంతో వీరమల్లు 2 ఉంటుందో లేదో అనే అనుమానాలను చాలా మంది వ్యక్తం చేశారు. కానీ నిధి అగర్వాల్‌ ఇప్పటికే కొంత షూటింగ్‌ చేశారని చెప్పడంతో ఖచ్చితంగా వీరమల్లు పార్ట్‌ 2 ఉంటుందని, అది ఎప్పుడు అనేది మాత్రం వెయిట్‌ చేయాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తక్కువ సమయంలోనే వీరమల్లు 2 షూటింగ్‌ను పూర్తి చేసే విధంగా ప్లాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరమల్లు 1 హిట్‌ అయితేనే వీరమల్లు 2 ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు.