ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. ఏర్పాటు చేసిందెవరు?
నిజానికి ప్రభుత్వ వాహనంలో అధికారులు లేదా నాయకులు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. కానీ గ్లామర్ పరిశ్రమకు చెందిన ఒక నటి ప్రయాణించడం ఆశ్చర్యపరిచింది.
By: Sivaji Kontham | 11 Aug 2025 11:55 PM ISTభీమవరంలో జరిగిన ఓ ప్రయివేట్ కార్యక్రమం(స్టోర్ లాంచ్)లో పాల్గొనేందుకు అందాల కథానాయిక నిధి అగర్వాల్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ) బోర్డ్ ఉన్న ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించడం వివాదం రేకెత్తించింది. నిధి ఆ వాహనంలో వెళుతున్న ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిధి కోసం ప్రభుత్వ అధికారులే వాహనం పంపడం విచిత్రంగా ఉంది! అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి ప్రభుత్వ వాహనంలో అధికారులు లేదా నాయకులు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. కానీ గ్లామర్ పరిశ్రమకు చెందిన ఒక నటి ప్రయాణించడం ఆశ్చర్యపరిచింది. తాజాగా దీనిపై నిధి అగర్వాల్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ వాహనం ఉపయోగించుకోవడంలో తన ప్రమేయం లేదని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో మాత్రమే తాను ప్రయాణించానని ఎక్స్ ఖాతాలో వివరణ ఇచ్చారు. ``కొందరు నన్ను విమర్శిస్తున్నారు. అధికారులే నా కోసం ఇది ఏర్పాటు చేసారని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం. ప్రభుత్వ అధికారులు ఎవరూ నా కోసం వాహనం పంపలేదు. ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేయడం నా బాధ్యత. మీ నిరంతర ప్రేమ సహాయసహకారాలకు ధన్యవాదాలు`` అని నిధి తెలిపింది.
ఇటీవలే విడుదలైన `హరి హర వీరమల్లు` చిత్రంలో నిధి అగర్వాల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియాలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయి వసూళ్లను అందుకోలేదు. తదుపరి ప్రభాస్ సరసన `రాజా సాబ్` లో నిధి నటిస్తోంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు రావాల్సి ఉంది.
