వీడియో : వీరమల్లు బ్యూటీ లైవ్ ఫెర్ఫార్మెన్స్
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులు గత రెండు ఏళ్లుగా ఎదురు చూస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు'.
By: Tupaki Desk | 28 May 2025 5:25 PM ISTపవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులు గత రెండు ఏళ్లుగా ఎదురు చూస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు'. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో షూటింగ్ ఎంతకూ పూర్తి కాకపోవడంతో చేసేది లేక క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు. క్రిష్ తప్పుకోవడంతో హరి హర వీరమల్లు సినిమా దర్శకత్వ బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. బ్యాలన్స్ వర్క్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం జ్యోతికృష్ణ చూసుకున్నారు. ప్రస్తుతం విడుదలకు సంబంధించిన పనులను కూడా ఆయనే చూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి.
జూన్ 12న విడుదల కాబోతున్న హరి హర వీరమల్లు సినిమా నుంచి మరో పాటను తాజాగా విడుదల చేశారు. చెన్నైలో జరిగిన భారీ ఈవెంట్‌లో ఈ సినిమా పాటను విడుదల చేశారు. తార తార నా కళ్లు అంటూ సాగే పాటను చెన్నైలో విడుదల చేశారు. ఈ పాట విడుదల కార్యక్రమంకు హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరు అయ్యారు. చిత్ర యూనిట్ సభ్యులు పలువురు ఈ వేడుకలో సందడి చేశారు. ముఖ్యంగా నిధి అగర్వాల్ తోటి డాన్సర్స్‌తో కలిసి అదే పాటకు డాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిధి అగర్వాల్ క్యూట్ అండ్ స్వీట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చేసిన డాన్స్ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. రాజ కుమారి పాత్రలో నిధి అగర్వాల్ కనిపించబోతుంది. అన్ని పాటల్లోనూ నిధి చాలా అందంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కాంబో సన్నివేశాల్లో నిధి అగర్వాల్ ఆకట్టుకుంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నిధి అగర్వాల్ గత రెండేళ్లుగా హరి హర వీరమల్లు సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఒకానొక సమయంలో ఈ సినిమా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కెరీర్ పరంగా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నిధి అగర్వాల్‌కి ఈ సినిమా అత్యంత కీలకం. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కువగా నిధి కనిపిస్తున్న విషయం తెల్సిందే.
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటి సారి పీరియాడిక్ పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాలో పవన్ మంచి దొంగగా కనిపిస్తాడని తెలుస్తోంది. సినిమాలోని ఆయన పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ అయింది. అలాగే కథ విషయంలోనూ కొంత మేరకు స్పష్టత ఉంది. త్వరలోనే ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాకి మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరమల్లు సినిమా షూటింగ్ కి రెడీ అవుతూ ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముంబైలో 'ఓజీ' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సైతం పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు.
