Begin typing your search above and press return to search.

ఫ్రైడే వీకెండ్ మారుతోంది… రిలీజ్ పై కొత్త రకం స్ట్రాటజీ!

ఇండస్ట్రీలో నిర్మాతలు డిస్కస్ చేసుకొని వీకెండ్ కలెక్షన్స్ పెంచుకోవడానికి సినిమాల రిలీజ్ డేని ఒక రోజు ముందుకి తీసుకొని వచ్చి ఉండొచ్చనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   27 April 2024 3:54 AM GMT
ఫ్రైడే వీకెండ్ మారుతోంది… రిలీజ్ పై కొత్త రకం స్ట్రాటజీ!
X

సౌత్ ఇండియాలో సినిమాల రిలీజ్ కోసం ప్రతి ఒక్కరు వీకెండ్ ను ఎంచుకుంటారు. మేగ్జిమమ్ రిలీజ్ లు శుక్రవారం రోజునే ఉంటాయి. శుక్రవారం మూవీ రిలీజ్ అయితే మొదటి రోజు ఎలాగూ ఓపెనింగ్స్ ఉంటాయి. తరువాత శని, ఆదివారాలు కలిసొస్తాయి. ఈ రెండు సెలవు రోజులు కావడంతో ఫ్యామిలీతో కలిసి అందరూ సినిమాలు చూడటానికి థియేటర్స్ కి వస్తారనే అంచనాతో ఈ పద్ధతిని చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నారు.

అయితే ఈ పద్ధతికి ఎండ్ కార్డు పడిపోతుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ ఏడాదిలో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోయే సినిమాలలో చాలా వరకు శుక్రవారం థియేటర్స్ లోకి రావడం లేదు. ఒక్క రోజు ముందుగా గురువారం నాడు డిఫరెంట్ డేట్స్ లో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. దీంతో శుక్రవారం సినిమా రిలీజ్ అనేది భవిష్యత్తులో చరిత్ర అయిపోతుందనే ప్రచారం నడుస్తోంది.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 జూన్ 13న ఐదు భాషలలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. జూన్ 13 గురువారం ఉండడం విశేషం. నెక్స్ట్ టాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కాబోయే కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వస్తోంది. ఇది కూడా గురువారమే కావడం గమనించదగ్గ విషయం. కల్కి మూవీ ఏకంగా 22 భాషలలో రిలీజ్ అవుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ కూడా ఆగష్టు 15న గురువారం రిలీజ్ కానుంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తోన్న సరిపోదా శనివారం మూవీ ఆగష్టు 29న రిలీజ్ అవుతోంది. ఈ డేట్ కూడా గురువారమే పడింది.

ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఇది కూడా గురువారమే వస్తోంది. ఒక్క రోజు ముందుగా రావడం అనేది ఎవరికి వారు కో ఇన్సిడెంట్ గా జరిగినట్లు అనిపించడం లేదు. ఇండస్ట్రీలో నిర్మాతలు డిస్కస్ చేసుకొని వీకెండ్ కలెక్షన్స్ పెంచుకోవడానికి సినిమాల రిలీజ్ డేని ఒక రోజు ముందుకి తీసుకొని వచ్చి ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. ఈ ఫార్ములా పాన్ ఇండియా సినిమాలకి వర్క్ అవుట్ అయితే భవిష్యత్తులో అందరూ కూడా గురువారంను గట్టిగా ఫాలో అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.