బాలీవుడ్ ఫ్లాపుల గుట్టు విప్పిన నెట్ ఫ్లిక్స్ CEO
ఇతర రకాలు ఏవైనా ఓటీటీల్లో మాత్రమే చూస్తారని భవిష్యత్ గురించి వర్ణించారు నెట్ ఫ్లిక్స్ సీఈవో సరండోస్.
By: Tupaki Desk | 27 April 2025 1:26 PM ISTఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాపులవుతున్నాయి. పెద్ద స్టార్లు నటించిన సినిమాలను కూడా జనం థియేటర్లకు వెళ్లి చూడటం లేదు. దానికంటే సౌత్ నుంచి వచ్చే భారీ అనువాద సినిమాలను ఆదరించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ పరిణామం నిపుణులకు సైతం మింగుడుపడటం లేదు. అయితే హిందీ చిత్రసీమ వరకే ఈ సమస్య ఉత్పన్నం కాలేదు.. మొత్తం భారతదేశంలో సినిమా వీక్షణ విధానం మారిపోయిందని నెట్ ఫ్లిక్స్ సీఈవో పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాజా ఈవెంట్లో ఆయన ఇచ్చిన వివరణ విస్తుగొలుపుతోంది.
ఇకపై భారీతనం నిండిన పెద్ద సినిమాలు, ప్రత్యేకత కలిగిన సినిమాలను మాత్రమే ప్రజలు థియేటర్లలో వీక్షిస్తారని, ఇతర రకాలు ఏవైనా ఓటీటీల్లో మాత్రమే చూస్తారని భవిష్యత్ గురించి వర్ణించారు నెట్ ఫ్లిక్స్ సీఈవో సరండోస్. కోవిడ్ సమయంలో అలవాటు పడిన ఓటీటీ భూతం భారతదేశంలోను అసాధారణంగా ఎదిగిందని కూడా సెలవిచ్చారు.
ఇంకా జనం గుంపులుగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే విధానాన్ని కొనసాగించడం లేదని అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ సినిమా వీక్షణ విధానం ఇప్పుడు లేదని, ఇంట్లోనే సినిమాలు చూడటాన్ని జనం ఇష్టపడుతున్నారని అన్నారు. అయితే ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అనుభవాన్ని కూడా ఇష్టపడతారని, అది రేర్ గా మాత్రమే జరుగుతుందని విశ్లేషించారు
సినిమాల వీక్షణకు, వినోదానికి థియేటర్ ఒక్కటే ఆప్షన్ కాదు. రొటీన్ విధానాన్ని ప్రజలు అనుసరించడం లేదని సీఈవో అన్నారు. దీని కారణంగా భవిష్యత్ లో థియేటర్ల వ్యవస్థ అనిశ్చితంగా మారుతుందని సరండోస్ విశ్లేషించారు. ప్రజలకు ఏం కావాలో అది ఓటీటీల్లో అందుబాటులో ఉన్నప్పుడు ఆశించినది లేని థియటర్లకు ఎందుకు వెళతారు? అని కూడా ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో సినిమా వీక్షణ విధానంలో ట్రెండ్స్ ని సరండోస్ తనదైన శైలిలో విశ్లషించారు. ఓటీటీల భవిష్యత్ కు ఎదురే లేదని కూడా ఆయన బలంగా నమ్ముతున్నారు.
