ట్రెండీ టాక్: నేపో కిడ్స్‌కే ఎందుకు ఈ హెడేక్?
కొత్త తారలతో పోలిస్తే, నేపో కిడ్స్ కి ఎల్లపుడూ వ్యతిరేకత ఉంటుంది. నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని వారి తండ్రులను లేదా తల్లులను మించిన ప్రతిభ చూపించాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 27 July 2025 7:00 AM ISTఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ లో భారతీయ సినీపరిశ్రమ ఒక్కటిగా ప్రపంచానికి కనిపిస్తోంది. అది హిందీ సినిమా అయినా, తెలుగు సినిమా అయినా లేదా తమిళం, మలయాళం, కన్నడ సినిమా అయినా కచ్ఛితంగా భారతీయ సినిమాగా ఎలివేట్ అవుతోంది. ఇది ఒక కొత్త పరిణామం. అందరూ డైజెస్ట్ చేసుకోవాల్సిన శుభతరుణం కూడా ఇది.
ఇలాంటి సమయంలో కొత్తగా పరిశ్రమకు పరిచయమయ్యే నేపోకిడ్స్‌కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. మునుపటిలా నటవారసులకు బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. ఫేవరెట్ స్టార్ల సినిమా టికెట్ల కోసం చొక్కాలు చించుకునే రోజులు కావు. కనీసం వారి సుపుత్రులను నెత్తిన పెట్టుకునే రోజులు కూడా పోయాయి. కంటెంట్ ఏల్తోంది. కొత్తతరం స్టార్లను నెత్తిన పెట్టుకుంటున్నారు. నిజానికి నటీనటులు యూనిక్ క్వాలిటీస్ తో నిరూపించుకుంటే అలాంటి వారికి గొప్ప గిరాకీ ఉంది.
కొత్త తారలతో పోలిస్తే, నేపో కిడ్స్ కి ఎల్లపుడూ వ్యతిరేకత ఉంటుంది. నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని వారి తండ్రులను లేదా తల్లులను మించిన ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. వారి కంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. అలా కాకుండా శ్రమ అన్నదే లేకుండా ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలనుకుంటే అది భ్రమ. ముఖ్యంగా నటవారసుల సినిమాలు వస్తున్నాయి అంటే విమర్శించే వాళ్లకు కొదవేమీ లేదు. అయితే లెగసీని ముందుకు నడిపించే నటవారసులపై ఇది తీవ్రంగా ఒత్తిడిని పెంచుతోంది. ఎవరైనా స్టార్ హీరో కుమారుడు లేదా కుమార్తె తెరకు పరిచయమైతే, కొన్ని విభాగాల్లో ఫెయిలై, కొన్ని కోణాల్లో సక్సెసైనా, సక్సెస్ పార్ట్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు. నేపోల గురించి నెగెటిబిటీ ఎక్కువగా ప్రచారమవుతోంది. నటవారసులతో పోలిస్తే ఈ సమస్య కొత్త కుర్రాళ్లకు తక్కువ. వారిని లైట్ గా విమర్శించి వదిలేస్తున్నారు తప్ప, దారుణమైన వ్యాఖ్యలతో కించపరచడం లేదు. నేపోకిడ్స్ ని మాత్రం తీవ్ర పరుష పదజాలంతో నెటిజనులు తిట్టిపోస్తున్నారు.
ఇటీవలే విడుదలైన సైయారా చిత్రంతో అహాన్ పాండే- అనీత్ పద్దా డెబ్యూ తారలుగా పరిచయమయ్యారు. ఆ ఇద్దరి నటన అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చినవారే కానీ, ఎవరూ వారిని ఏదో ఒక కోణంలో విమర్శించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కొత్త జంట ఎలాంటి లోటుపాట్లు లేకుండా నటించారా? అంటే అవునని చెప్పడానికి లేదు. అహాన్ నటవారసుడే అయినా అనీత్ పద్దా కొత్తమ్మాయి. కనీసం తనను అయినా విమర్శించి ఉండాల్సింది. కానీ ఆ ఇద్దరి నటన, క్యూట్ లుక్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ తరహా అభిమానం కొంతవరకే. కొత్త తరం నటీనటులు తమ ఆరంభ విజయాన్ని ఆలంబనగా చేసుకుని, ప్రతి సినిమాతో తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే విమర్శకులు సినిమా చూసేప్పుడు నేపో కిడ్స, ఔట్ సైడర్స్ లేదా కొత్తవారు అనేది చూడకుండా, వారి ప్రతిభను ఒరిజినల్ గా ఉన్నది ఉన్నట్టుగా విశ్లేషించాలి. ప్రతి విమర్శ నిజాయితీతో కూడుకున్నదై, వాస్తవాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి.
