సీనియర్ డిస్ట్రిబ్యూటర్ నెల్లూరు హరి అకాల మృతి!
టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం నెలకొంది. నెల్లూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ సీనియర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారుడు), ఎగ్జిబిటర్ గుజ్జలపూడి హరి కుమార్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా కన్నుమూశారు.
By: Sivaji Kontham | 24 May 2026 12:24 PM ISTటాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం నెలకొంది. నెల్లూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ సీనియర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారుడు), ఎగ్జిబిటర్ గుజ్జలపూడి హరి కుమార్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా కన్నుమూశారు. అతడు ఫిలింసర్కిల్స్ లో నెల్లూరు హరిగా సుపరిచితులు. అతడి హఠాన్మరణం నెల్లూరు జిల్లాతో పాటు మొత్తం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మరణవార్త విన్న సినీ ప్రముఖులు, స్థానిక థియేటర్ యాజమాన్యాలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా నెల్లూరు డిస్ట్రిబ్యూషన్ - ఎగ్జిబిషన్ రంగంలో హరి ఎంతో చురుకైన పాత్ర పోషించారు. స్థానిక సినీ వ్యాపార వర్గాల్లో ఆయనకు ఎంతో మంచి పేరు, బలమైన సంబంధాలు ఉన్నాయి. ఎన్నో పెద్ద పెద్ద తెలుగు సినిమాలను నెల్లూరు ఏరియాలో విజయవంతంగా పంపిణీ చేసిన ట్రాక్ రికార్డ్ అతడి సొంతం. నెల్లూరు ఫిల్మ్ సర్కిల్‌లో ఒక కీలకమైన పిల్లర్‌గా ఉంటూ..పరిశ్రమ ఎదుగుదలకు ఈ యువ పంపిణీదారుడు అందించిన సేవలు ఎనలేనివని తోటి వ్యాపారవేత్తలు గుర్తుచేసుకుంటున్నారు.
అయితే అందరినీ మరింత కలచివేస్తున్న విషయం ఏమిటంటే... హరి కేవలం 46 సంవత్సరాల చిన్న వయసులోనే మరణించడం. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక యువ పంపిణీదారుడు ఇలా అకాల మరణం చెందడం అతడి కుటుంబంలోనే కాకుండా... పరిశ్రమలోనూ పూడ్చలేని లోటును మిగిల్చింది. హరితో ఉన్న అనుబంధాన్ని.. ఆయనతో కలిసి చేసిన వ్యాపార ప్రయాణాన్ని స్మరించుకుంటూ సహోద్యోగులు, మిత్రులు సామాజిక మాధ్యమాల వేదికగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.
సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూషన్ రంగం ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. ఎగ్జిబిషన్ రంగం క్రైసిస్ కారణంగా పంపిణీ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఇలాంటి చోట హరి ఎంతో బ్యాలెన్స్ డ్ గానే ఇంతకాలం వ్యాపారం చేయడం ఆసక్తికరం. మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాల బిజినెస్ సమీకరణాలు మారుతున్న వేళ... నెల్లూరు లాంటి కీలకమైన ఏరియాలో పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నడిపించిన అతికొద్ది మందిలో ఒకరు ఈరోజు లేకపోవడం ఎంతో పెద్ద లోటు. ఆయన మరణం కేవలం సన్నిహితులకే కాదు.. మొత్తం నెల్లూరు చలనచిత్ర వ్యాపార వర్గాలకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.
హరి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ కష్టసమయంలో అతడి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని టాలీవుడ్ వర్గాలు ప్రార్థిస్తున్నాయి. హరి అకాల మృతితో నెల్లూరు సినీ వాతావరణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒక మంచి పంపిణీదారుడిని కోల్పోవడం వల్ల స్థానిక ఫిల్మ్ సర్కిల్ ఒక సమర్థుడైన మార్గదర్శిని కోల్పోయినట్లయింది. 2025లో `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో భారీ లాభాలు ఆర్జించానని హరి చెబుతున్న ఓ వీడియో కూడా ఇంటర్నెట్ లో ఇప్పుడు మరోసారి వైరల్ గా మారుతోంది.
