తిరుమలలో ఘనంగా బాలయ్య బర్త్ డే వేడుకలు
టాలీవుడ్ సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఇవాళ తన 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
By: Tupaki Desk | 10 Jun 2025 2:42 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఇవాళ తన 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియచేస్తుండగా, మరికొందరు ఆయన పుట్టిన రోజు వేడుకలను పండుగలా జరుపుకుంటున్నారు.
ఫ్యాన్స్ రక్త దానాలు, రోడ్డు షో లు, అన్నదానాలు నిర్వహిస్తూ తమ అభిమాన హీరోపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే బాలయ్య 65వ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ. తిరుమలలోని శ్రీవారి గుడి వద్ద ఉన్న అఖిలాండం వద్ద 650 టెంకాయలు కొట్టి, 6.5 కేజీల కర్పూరాన్ని వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
బాలయ్య ఆయురారోగ్యాలతో ఉండటంతో పాటూ ప్రజలకు మరింత సేవ చేయాలని స్వామి వారిని కోరుకుని తమ మొక్కులు చెల్లించుకున్నట్టు శ్రీధర్ వర్మ తెలిపారు. దీంతో పాటూ ఏపీ సీఎం చంద్రబాబు కూడా బాలయ్య బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేశారు. వెండి తెర హీరోగా కోట్లాది మంది ఫ్యాన్స్ ను పొందిన మీరు, నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఏపీ ఐటీ మినిస్టర్, బాలయ్య అల్లుడు నారా లోకేష్ కూడా బాలయ్యకు విషెస్ చెప్తూ పోస్ట్ చేశారు. సిల్వర్ స్క్రీన్ పై ఆయనో లెజెండ్. పొలిటికల్ స్క్రీన్ పై ఆయన అన్‌స్టాపబుల్, ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య, నా ముద్దుల మావయ్య అంటూ నారా లోకేష్ బాలయ్యను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా బోయపాటి శ్రీనుతో ఆయన చేస్తున్న అఖండ2 నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయగా యూట్యూబ్ లో ఆ టీజర్ టాప్ ట్రెండింగ్ లో ఉండటంతో పాటూ సినిమాపై అంచనాలను పెంచింది.