విఘ్నేష్ తో విసిగిపోయిన నయనతార.. నిజమెంత?
గత మూడేళ్ల కిందట విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లి కూడా అయ్యారు.
By: Tupaki Desk | 3 July 2025 3:44 PM ISTలేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ పరంగా ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారనే సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కెరీర్ పరంగా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ నయనతార మాత్రం ఎప్పుడూ ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. గత మూడేళ్ల కిందట విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లి కూడా అయ్యారు.
రీసెంట్ గా వీరి పెళ్లి రోజును విదేశాల్లో జరుపుకోగా దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను కూడా చూశాం. వీరిద్దరి మధ్య ఉండే బంధాన్ని చూసి నెటిజన్లు కపుల్ గోల్స్ అంటూ ఎన్నో వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి వీరిద్దరూ విడిపోతున్నారని సడెన్ గా వార్తలు రావడంతో మరోసారి నయనతార- విఘ్నేష్ పేర్లు వివాదంలోకి వచ్చాయి.
బుధవారం రోజున ఉన్నట్టుండి నయనతార ఇన్‌స్టా స్టోరీ గా ఓ ఫోటోను ఎడిట్ చేసి ఆ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ స్క్రీన్ షాట్ లో విఘ్నేష్ చేసిన పనుల వల్ల తాను విసుగు చెందినట్టు నయనతార రాసినట్టు ఉంది. వైరల్ అయిన ఫోటోలో నయనతార ఇన్నాళ్లూ ఎంత బాధ పడిందోననే విషయాలను రాసుకొచ్చినట్టు కనిపిస్తోంది.
ఓ తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కచ్ఛితంగా పొరపాటే అవుతుందని, మీ భర్త పనులకు మీరు బాధ్యత వహించాల్సిన పన్లేదని, ఎందుకంటే మగాళ్లు ఎప్పుడూ పెద్దగా ఎదగరని, ఇక తనను ఒంటరిగా వదిలేయడం మంచిదని, మీ అందరితో నేను చాలా విసిగిపోయానని ఆ పోస్ట్ లో నయన్ పోస్ట్ చేసినట్టు ఎవరో కావాలని ఎడిట్ చేసి దాన్ని వైరల్ చేశారు.
ఈ ఫోటో ఫేక్ అయినప్పటికీ చాలా మంది దాన్ని నిజమని నమ్మి విఘ్నేష్, నయన్ మధ్య చాలా సమస్యలున్నాయనుకుంటున్నారు. కొందరైతే ఈ విషయంలో విఘ్నేష్ శివన్ ను ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. అయితే ఈ ఫోటో వందకి వంద శాతం నకిలీనేనని తెలియడంతో వారి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. నయనతార బుధవారం రోజు తన ఇన్‌స్టాలో అలాంటి స్టోరీలేమీ పోస్ట్ చేయలేదు.
