Begin typing your search above and press return to search.

యానిమ‌ల్ విజ‌యంపై న‌వాజుద్దీన్ ఆందోళ‌న‌

అయితే జావేద్ కి యానిమ‌ల్ టీమ్ త‌మ‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చింది. యానిమల్‌పై చర్చల న‌డుమ సీనియ‌ర్ న‌టుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ బాలీవుడ్ భవిష్యత్తుపై తన ఆందోళనను వ్యక్తం చేశాడు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 3:58 AM GMT
యానిమ‌ల్ విజ‌యంపై న‌వాజుద్దీన్ ఆందోళ‌న‌
X

హింస‌..ర‌క్త‌పాతం.. విద్వేషం .. అంటూ యానిమ‌ల్ పై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. అందుకే 'యానిమల్' లాంటి సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత బాలీవుడ్ భవిష్యత్తుపై భారీ చర్చ నడుస్తోంది. ఇటీవల జావేద్ అక్తర్ యానిమల్ విజయం ప్రమాదకరమని పేర్కొన్నాడు. స్త్రీ ద్వేషపూరిత చిత్రం చేసినందుకు సందీప్ రెడ్డి వంగాపై విరుచుకుపడ్డాడు.అయితే జావేద్ కి యానిమ‌ల్ టీమ్ త‌మ‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చింది. యానిమల్‌పై చర్చల న‌డుమ సీనియ‌ర్ న‌టుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ బాలీవుడ్ భవిష్యత్తుపై తన ఆందోళనను వ్యక్తం చేశాడు.

ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో బాగా ఆడుతున్న చిత్రాల తీరు తెన్నుల‌పై తన చింతను న‌వాజుద్దీన్ వ్య‌క్త‌ప‌రిచాడు. "అవే సినిమాలు, విభిన్న నటీనటులు, కాస్ట్యూమ్స్, మేకప్‌లతో తీస్తున్నారు. నేను నిజంగా భవిష్యత్తు గురించి నిస్సహాయంగా ఉన్నాను. చాలామంది ప్రజలు ఆశాజనకంగా ఉంటారు. కానీ ప్రేక్షకులు ఒక నిర్దిష్టమైన సినిమాని చూడటానికి ఇష్టపడతారు. అది మంచిదే.. వారు ఆ త‌ర‌హా సినిమాల్ని తప్పక చూస్తారు. కానీ ప్రతి భిన్న‌మైన జాన‌ర్ సినిమాలు మనుగడ సాగించాలి.. అది జరగడం లేదు" అని నిరాశ‌ను వ్య‌క్తం చేసారు. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'తో 90ల సినిమాకి, ఇప్పుడున్న సినిమాకి తేడా ఏమిటని అడిగినప్పుడు నవాజ్ ఇలా చెప్పాడు. తాను కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడడం లేదని తన వైఖరిని స్పష్టం చేస్తూ "నేను కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడను.. అది కోట్లాది మందికి నచ్చుతుంది.. నేను కూడా ఇష్టపడతాను. కానీ ఇతర తరహా సినిమా ఈరోజు మనుగడలో ఉండకపోవచ్చు. దానికి కొంత సమయం పడుతుంది. ఇంతకుముందు రెండు రకాల సినిమాలూ మనుగడలో ఉన్నాయి.. కానీ ఇప్పుడు కాదు"అని అన్నాడు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ తనను తాను విధేయుడైన నటుడిన‌ని చెప్పుకున్నారు. న‌వాజ్ తన మొదటి స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే సత్తా చాటారు. ఇప్పటివరకు అతను తన అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. రెండు మూడు సంవత్సరాలుగా ఆశించినంత‌ పెద్దగా పని చేయ‌లేదని, తాను విధేయుడైన నటుడిని అని.. సిన్సియర్ ప్రాసెస్ ఉన్నవాడిన‌ని, తన గత చిత్ర నిర్మాతలందరూ త‌న‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారని ఆయన ఉద్వేగభరితంగా చెప్పారు. "నేను ఎవ‌రితో ప‌ని చేసానో వారంతా మళ్లీ నాతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు.. నేను విధేయుడైన నటుడిని.. సినిమా కోసం అన్నీ చేస్తాను.. చాలా సిన్సియర్‌గా ప్రాసెస్ లో ఉంటాను.. నటనే నాకు సర్వస్వం.. నా సంతోషం నా పనిలోనే ఉంది. నా జీవితం.. నాకు సంతోషాన్నిస్తుంది.. నేను దాని గురించి గర్విస్తున్నాను" అని తెలిపారు. యానిమ‌ల్ సినిమాపై న‌వాజుద్దీన్ ఆందోళ‌న‌ను ప‌రిశీలిస్తే.. అత‌డు ఈ సినిమా విజ‌యాన్ని విమ‌ర్శించ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఒకే జాన‌ర్ సినిమాలు చూసేందుకు ప్రేక్ష‌కులు అల‌వాటు ప‌డితే, వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాను చూడ‌టం మ‌ర్చిపోతున్నార‌నే ఆవేద‌న అత‌డిలో వ్య‌క్త‌మైంది. సందీప్ వంగాను కానీ, యానిమ‌ల్ కంటెంట్ ని కానీ అత‌డు దూషించ‌లేదు.