Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : నానిపై తమిళ అభిమానం ఇలా..!

నేచురల్‌ స్టార్‌ నాని 'హిట్‌ 3' సినిమాతో వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. మే 1న విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్స్‌లో నాని ఫుల్‌ బిజీగా ఉన్నాడు

By:  Tupaki Desk   |   26 April 2025 6:25 PM IST
పిక్‌టాక్ : నానిపై తమిళ అభిమానం ఇలా..!
X

నేచురల్‌ స్టార్‌ నాని 'హిట్‌ 3' సినిమాతో వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. మే 1న విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్స్‌లో నాని ఫుల్‌ బిజీగా ఉన్నాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. నాని హీరోగా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు వరుసగా అలరిస్తున్నాయి. అయితే నాని పాన్‌ ఇండియా కోరిక మాత్రం అలాగే ఉండి పోయింది. నాని శ్యామ్‌ సింగరాయ్ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో కచ్చితంగా హిట్‌ అవుతుందని భావించాడు. కానీ నిరాశ పరిచింది. దసరా సినిమా కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అయింది. కానీ ఆశించిన స్థాయిలో అక్కడ ఆడలేదు. అయినా నిరాశ పడకుండా ప్రస్తుతం హిట్‌ 3 ను అక్కడ ప్రమోట్‌ చేస్తున్నాడు.

హిట్‌ 3 సినిమాను తమిళనాడు, కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. నార్త్‌ ఇండియాలోనూ సినిమాను ప్రమోట్‌ చేయడం కోసం నాని తనవంతు ప్రయత్నాలు చేశాడు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెన్నై వెళ్లాడు. ఆ సమయంలో తమిళ ఆడియన్స్ నుంచి నాని అండ్‌ టీంకి మంచి స్పందన లభించింది. అక్కడి అభిమానులు, మీడియా వర్గాల వారు, ఇండస్ట్రీ వర్గాల వారు నానికి సాదర స్వాగతం పలికారు. నానిపై తమిళ జనాలు ఇలా అభిమానంను కనబర్చారు. నాని షర్ట్‌పై తమిళనాడు ప్రజలకు మీరు చాలా స్పెషల్‌, మీ సినిమాల కోసం తమిళ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అంటూ మెసేజ్‌లను, ఆటోగ్రాఫ్‌లను ఇచ్చారు.

నాని గతంలోనే తమిళ ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఒక తమిళ సినిమాలోనూ నటించాడు. 2011లో వెప్పం అనే తమిళ్ మూవీలో నటించడం ద్వారా అక్కడి ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల డైరెక్ట్‌ తమిళ్ సినిమాలను చేయలేదు. కానీ తన సినిమాలతో బుల్లి తెర లేదా ఓటీటీ ద్వారా తమిళ ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఈగ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. నాని హీరోగా నటించిన చాలా సినిమాలు తమిళనాడులో థియేట్రికల్‌ రిలీజ్‌ అయ్యి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా, ఓటీటీ, శాటిలైట్‌ ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా అక్కడ మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.

హిట్‌ 3 సినిమాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత హింసాత్మకంగా కనిపించబోతున్నాడు. హిట్‌ 3 సినిమాను బెంగళూరులోనూ ప్రముఖంగా ప్రచారం చేశాడు. అక్కడ శ్రీనిధి శెట్టితో కలిసి నాని సినిమాను ప్రచారం చేస్తున్నాడు. హిట్‌ 3 సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ను అందుకునే అవకాశాలు ఉన్నాయి. హిట్‌ 1, హిట్‌ 2 సినిమాలకు మంచి స్పందన దక్కింది. హిట్‌ ప్రాంచైజీలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. హిట్ 3 పాన్‌ ఇండియా రేంజ్‌లో హిట్‌ అయితే ది ప్యారడైజ్‌ సినిమా ఖచ్చితంగా మరింతగా బ్లాక్ బస్టర్‌ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.