Begin typing your search above and press return to search.

'గేమ్ ఛేంజర్‌'పై నట్టి కామెంట్స్.. తప్పంతా దిల్ రాజుదా?

రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల సమయంలో ప్రకటించిన తొలి రోజు కలెక్షన్లపై అప్పట్లో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

By:  M Prashanth   |   8 July 2026 12:00 AM IST
గేమ్ ఛేంజర్‌పై నట్టి కామెంట్స్.. తప్పంతా దిల్ రాజుదా?
X

రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల సమయంలో ప్రకటించిన తొలి రోజు కలెక్షన్లపై అప్పట్లో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సినిమా నిజంగా సాధించిన వసూళ్ల కంటే అఫీషియల్ పోస్టర్‌ లో భారీ నెంబర్స్ ప్రకటించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా నిర్మాత దిల్ రాజు ఆ పోస్టర్‌ పై చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు నిర్మాత నట్టి కుమార్ చేసిన కామెంట్స్ మరోసారి ఆ అంశాన్ని హాట్ టాపిక్‌ గా మార్చాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. తొలి రోజు రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అంటూ విడుదల చేసిన పోస్టర్ వాస్తవానికి సరైన సంఖ్య కాదని అంగీకరించారు. స్టార్ హీరోల సినిమాల విషయంలో అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటుందని, "వాళ్ల హీరోకి అంత వేశారు.. మా హీరోకి కూడా అంతే వేయాలి" అనే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు.

అలాంటి పరిస్థితుల్లో తాము కూడా ఆ పోస్టర్ విడుదల చేశామని, అయితే అది నిజం కాదని రెండో రోజుకే అందరికీ అర్థమైపోతుందని వ్యాఖ్యానించారు. దిల్ రాజు చేసిన ఆ వ్యాఖ్యల తర్వాత పోస్టర్ వసూళ్ల అంశంపై ఇప్పుడు నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"కొణిదెల ఫ్యామిలీ ఫేక్ కలెక్షన్స్ ఉండవ్. కానీ మొన్న దిల్ రాజు చెప్పారు. గేమ్ ఛేంజర్ మూవీ విషయంలో అన్నీ అడగకూడదు, చెప్పకూడదని అన్నారు. గేమ్ ఛేంజర్ విషయంలో ఫేక్ కలెక్షన్లు వేసుంటే దిల్ రాజు గారే వేసి ఉండాలి. కానీ రామ్ చరణ్ గారో చిరంజీవి గారో.. ఫేక్ కలెక్షన్లు వేయమని అడగరు. కొణిదెల ఫ్యామిలీ ఉన్నట్లే వేయమంటుంది. గొప్ప కోసం కలెక్షన్లు వేసుకుంటే తప్పు అది. ప్రపంచంలో ఎక్కడ ఎంత వసూళ్లు వచ్చేయో మేమైతే క్లియర్‌గా చెప్పాం" అంటూ నట్టి కుమార్ వ్యాఖ్యానించారు.

దీంతో గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివాదంలో అసలు బాధ్యత ఎవరిదనే చర్చ మళ్లీ మొదలైంది. నట్టి వ్యాఖ్యల ప్రకారం.. హీరోలు లేదా కొణిదెల కుటుంబానికి ఆ విషయంలో సంబంధం లేదని, ఒకవేళ ఫేక్ కలెక్షన్ల పోస్టర్ విడుదలై ఉంటే అది నిర్మాత స్థాయిలో తీసుకున్న నిర్ణయమే అయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక దిల్ రాజు కూడా ఫ్యాన్స్ ఒత్తిడి కారణంగానే అలాంటి పోస్టర్లు విడుదల చేసే పరిస్థితులు వస్తాయని చెప్పడం గమనార్హం.

ఇప్పుడు టాలీవుడ్‌ లో భారీ కలెక్షన్ల పోస్టర్ల క్రెడిబిలిటీపై మరోసారి చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అధికారిక వసూళ్లను నమ్మాలా? లేక ట్రేడ్ వర్గాలు వెల్లడించే లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వివాదం ముగిసిపోయిందనుకున్న సమయంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు, వాటిపై నట్టి కుమార్ రెస్పాన్స్ తో ఆ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హీరోల ఇమేజ్ కోసం కలెక్షన్లను పెంచి చూపించడం సరైన విధానమా అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది.