ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!
‘సీన్’ క్లైమాక్స్ ఫైట్ సమయంలో సూర్య తనను సొంత కొడుకులా చూసుకున్నారని నటుడు నస్లెన్ తెలిపారు. యాక్షన్ సన్నివేశాల్లో గాయపడకుండా రక్షణ పరికరాలు ఉన్నాయా లేదా స్వయంగా పరిశీలించేవారని చెప్పారు. తన నటనకు మెచ్చి సూర్య రూ.9–12 లక్షల విలువైన కార్టియర్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
By: Priya Chowdhary Nuthalapti | 20 Nov 2026 2:40 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సీన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ వసూళ్లు సాధిస్తూ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో సూర్య నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో కీలకమైన నెగటివ్ పాత్రలో కనిపించిన మలయాళ నటుడు నస్లెన్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు సినిమా విజయంతో పాటు సూర్య చూపించిన మంచి మనసు గురించి నస్లెన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సూర్యతో కలిసి పనిచేసిన అనుభవాన్ని నస్లెన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా క్లైమాక్స్‌లో సూర్య, నస్లెన్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ సన్నివేశం కోసం సూర్య తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో గాయాలు కాకుండా అవసరమైన రక్షణ పరికరాలు ధరించానా లేదా అని స్వయంగా పరిశీలించేవారని చెప్పారు.
ఈ విషయాన్ని వివరిస్తూ నస్లెన్ మాట్లాడుతూ.. "సూర్య సార్ చాలా మంచి మనిషి. ఆయన ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లో నాతో కలిసి నటిస్తున్నప్పుడు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. మోకాళ్లకు ధరించే ప్యాడ్స్‌తో పాటు అవసరమైన అన్ని రక్షణ పరికరాలు ఉన్నాయా లేదా అని చూసుకున్నారు. 'నిన్ను నా కొడుకులా చూస్తున్నాను. కానీ వీటన్నింటినీ నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి' అని చెప్పారు. ఆయన నిజంగా అద్భుతమైన మనిషి" అని ప్రశంసించారు.
సూర్య తనపై చూపించిన అభిమానానికి మరో గుర్తుగా నస్లెన్కు ఖరీదైన బహుమతి కూడా ఇచ్చారంట. సీన్ సినిమాలో నస్లెన్ నటనకు మెచ్చి కార్టియర్ బ్రాండ్‌కు చెందిన విలాసవంతమైన వాచ్‌ను బహుమతిగా అందించారు. ఈ వాచ్ విలువ సుమారు రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుందని సమాచారం. మాథృభూమికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నస్లెన్ ఈ వాచ్‌ను చూపించగా, ఆయనతో ఉన్న నటుడు కుంచాకో బోబన్ కూడా ఆశ్చర్యపోయారు. సరదాగా సూర్య ఫోన్ నంబర్ ఇవ్వాలని అడిగారు.
నస్లెన్కు మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. తన్నీర్ మథన్ దినంగళ్ సినిమాతో నటుడిగా పరిచయమైన ఆయన ప్రేమలు చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత లోకా చాప్టర్ 1: చంద్రతో మరో విజయాన్ని అందుకున్నారు. సీన్ ఆయనకు తమిళ చిత్ర పరిశ్రమలో తొలి సినిమా కావడం విశేషం.
జీతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య, నస్లెన్‌తో పాటు నజ్రియా నజీమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
