సీనియర్ నటుడు పాకిస్తాన్‌కి మద్ధతు?
పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ కు మద్దతుగా నిలిచిన సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నారు.
By: Tupaki Desk | 2 July 2025 4:48 AMపంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ కు మద్దతుగా నిలిచిన సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయనను మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే రామ్ కదమ్ తీవ్రంగా వ్యతిరేకించారు. నసీరుద్దీన్ షా హిందూ వ్యతిరేకి. ఆయన కైలాస భూమిని అవమానించారని, పాకిస్తానీ ప్రజలపై ఉన్న ప్రేమను భారతీయ ప్రజలపై చూపించడం లేదని అన్నారు.
పహల్గామ్ దాడి తర్వాత కూడా ఆయన ఇలా మాట్లాడుతున్నారు. పాక్ ఉగ్రదాడిలో మరణించిన టూరిస్టుల కుటుంబాలను ఆయన అవమానించారని కదమ్ అన్నారు. పాకిస్తాన్ మనకు బద్ధ వ్యతిరేకి అనే విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. ఆయన హిందూ వ్యతిరేకి.. సున్నితత్వం లేని వ్యక్తి అని కూడా కదమ్ విమర్శించారు. అంతేకాదు నసీరుద్దీన్ షా చేతులెత్తి నమస్కరిస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కదమ్ డిమాండ్ చేసారు.
నసీరుద్దీన్ షా దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. దిల్జీత్ సినిమా సర్దార్జీ 3లో పాకిస్తానీ నటి హనియా అమీర్ నటించినందున భారతదేశంలో నిషేధాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో దిల్జీత్ కి మద్ధతుగా కొందరు తమ స్వరం వినిపిస్తున్నారు. ఇప్పుడు నసీరుద్దీన్ షా దిల్జిత్‌కు మద్దతుగా నిలిచారు. కానీ ఆయనపై ప్రజలు విరుచుకుపడ్డారు. తీవ్రంగా విమర్శిస్తుండడంతో నసీరుద్దీన్ షా తన ఫేస్ బుక్ పోస్ట్ ను తొలగించారు.
నసీరుద్దీన్ ఎఫ్.బిలో ఏం రాసారు?
అతడు తన సామాజిక మాధ్యమాల్లో దిల్జీత్ కి మద్ధతుగా నిలుస్తూ, జుమ్లా పార్టీ డర్టీ ట్రిక్స్ డిపార్ట్‌మెంట్! అని పరోక్షంగా భాజపా నుద్దేశించి కామెంట్ చేసారు. పాకిస్తానీ నటి హనియా అమీర్‌ను ఈ సినిమాలో నటించడానికి దిల్జీత్ బాధ్యుడు కాడు... దర్శకుడు బాధ్యత వహించారు. కానీ ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. దిల్జిత్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఆయన మనసు విషపూరితం కాకపోవడంతో పాక్ నటి ఎంపికకు అంగీకరించారు.. అని నసీరుద్దీన్ అన్నారు. దిల్జీత్‌ను కించపరిచే ప్రయత్నాలను నసీరుద్దీన్ షా ఖండించారు. పాకిస్తాన్ ప్రజలకు అతడు సంఘీభావం వ్యక్తం చేశారు. అక్కడ తన స్నేహితులను కలుస్తూనే ఉంటానని చెప్పారు.. ``పాకిస్తాన్‌కు వెళ్లండి అని చెప్పే వారికి నా ప్రతిస్పందన - కైలాసానికి వెళ్లండి!`` అని రాసారు. ఈ ప్రకటన భాజపా నాయకుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. ప్రజలు కూడా తీవ్రంగా ప్రతిస్పందించడంతో నసీరుద్దీన్ షా తన ఫేస్ బుక్ పోస్ట్ ని తొలగించారు. పవిత్రమైన కైలాస భూమిని అవమానిస్తూ, హిందూ వ్యతిరేకతను కనబరిచారని నసీరుద్దీన్ షాను భాజపా నాయకులు విమర్శించారు. త్వరలో ముంబై మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సందర్భంలో ఇప్పుడు రాజకీయంగా వేడి మరింత పెరగడం కూడా దిల్జీత్ సినిమాకి చిక్కుల్ని తెచ్చిపెడుతోంది.