Begin typing your search above and press return to search.

'నరుడి బ్రతుకు నటన'.. రిలీజ్‌కు ముందే 60 అవార్డులు అందుకున్న సినిమా!

ఇందులో భాగంగా ఇప్పుడు 'నరుడి బ్రతుకు నటన' అనే సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు

By:  Tupaki Desk   |   6 April 2024 12:53 PM GMT
నరుడి బ్రతుకు నటన.. రిలీజ్‌కు ముందే 60 అవార్డులు అందుకున్న సినిమా!
X

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో 'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ' ఒకటి. వీలయినంత త్వరగా 100 సినిమాలు చేసిన నిర్మాణ సంస్థగా నిలవాలనే టార్గెట్ పెట్టుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. ఆయనకు అన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలుస్తూ, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు వివేక్ కూఛిబొట్ల. ఓవైపు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులతో చిత్రాలు తెరకెక్కిస్తూ మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ రూపొందున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు 'నరుడి బ్రతుకు నటన' అనే సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.

'నరుడి బ్రతుకు నటన' సినిమాలో శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రిషికేశ్వర్ యోగి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. 12వ దాదాసాహెబ్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా జ్యూరీ అవార్డ్ అందుకుంది. విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అలాంటి చిత్రాన్ని మేకర్స్ సమ్మర్ స్పెషల్ గా ఈ నెలలో థియేటర్లలోకి తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈరోజు శ‌నివారం 'నరుడి బ్రతుకు నటన' మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం.. ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను ఆవిష్కరించడం ద్వారా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'చూడు సత్యా.. నీకు యాక్టింగ్ రాదు, ఆ విషయం అందరికీ తెలుసు' అంటూ ప్రారంభమైన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ కథంతా కేరళ బ్యాక్ డ్రాప్ లో స‌త్య అనే ఓ యాక్టర్ జీవితం చుట్టూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నవ్వు, బాధ, ప్రేమ, స్నేహం.. ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఎంతో సహజంగా చూపించినట్టుగా అనిపిస్తోంది. చివర్లో వచ్చే ''లైఫ్‌లో బాధ‌లు, క‌ష్టాలు, అవ‌మానాలు వ‌స్తుంటాయి.. అడ్జెస్ట్ అవుతూ వెళ్లిపోవాలి అంతే" అనే డైలాగ్ బాగుంది.

'నరుడి బ్రతుకు నటన' సినిమా షూటింగ్ అంతా కేరళ ప్రాంతంలోనే జరిగింది. ఈ గ్లింప్స్ లో అక్కడి ప్రకృతి అందాలే హైలెట్ అయ్యాయి. అందమైన లొకేష‌న్స్‌, విజువ‌ల్స్‌ తో పాటు మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఓవరాల్ గా 80 సెకన్ల ఈ వీడియో చూస్తుంటే.. మన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా, ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తోంది. ఈ చిత్రానికి ఫహద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. లోపెజ్ సంగీతం సమకూర్చారు.

'నరుడి బ్రతుకు నటన' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వివేక్ కూఛిబొట్ల గారు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.