Begin typing your search above and press return to search.

మంచి సినిమాకు టైటిల్‌ పెద్ద మైనస్‌

ఒక భాషలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలను మరో భాషలో కొన్ని వారాల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత డబ్‌ చేసి రిలీజ్ చేయడం అనేది చాలా ఏళ్ల నుంచి వస్తుంది.

By:  Tupaki Desk   |   1 Jun 2025 9:40 AM IST
మంచి సినిమాకు టైటిల్‌ పెద్ద మైనస్‌
X

ఒక భాషలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలను మరో భాషలో కొన్ని వారాల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత డబ్‌ చేసి రిలీజ్ చేయడం అనేది చాలా ఏళ్ల నుంచి వస్తుంది. తెలుగులో ప్రధానంగా తమిళ్‌, మలయాళ సినిమాలు ఎక్కువగా డబ్‌ అవుతూ వచ్చాయి. కన్నడ, హిందీ సినిమాలు రేర్‌గా డబ్‌ అయ్యి థియేట్రికల్‌ రిలీజ్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒరిజినల్‌ భాషలో రిలీజ్ అయిన సమయంలోనే ఇతర భాషల్లోనూ డబ్‌ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. రెండు మూడు వారాల తర్వాత డబ్‌ అయ్యి రిలీజ్ అయినా ఫలితం తారుమారు అవుతుంది. ఆలస్యం అయితే అప్పటికే బజ్ తగ్గడంతో పెద్దగా వసూళ్లు రావడం లేదు.

ఒరిజినల్ వర్షన్‌లో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు కొన్ని రెండు మూడు వారాల తర్వాత తెలుగులో డబ్‌ అయ్యి రిలీజ్ అయ్యాయి. వాటి ఫలితం ఏంటో మనం చూశాం. అందుకే సాధ్యం అయినంత వరకు అన్ని సినిమాలు ఒరిజినల్ వర్షన్‌తో పాటు ఇతర భాషల్లోనూ డబ్‌ అవుతున్నాయి. మొన్న శుక్రవారం మలయాళ సినిమా 'నరివెట్ట' సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో విడుదల అయిన సమయంలోనే తెలుగులోనూ విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన టోవినో థామస్‌ హీరోగా నటించిన 'నరివెట్ట' సినిమాను అదే టైటిల్‌తో డబ్‌ చేశారు. మొన్న శుక్రవారం మహేష్ బాబు 'ఖలేజా' సినిమా రీ రిలీజ్ కావడంతో ఇతర సినిమాలు తొక్కి వేయబడ్డాయి.

ఖలేజా సినిమా రీ రిలీజ్ కారణంగా 'భైరవం' సినిమాకు నష్టం జరిగిన విషయం తెల్సిందే. భైరవం గురించి అందరికీ తెలుసు కానీ 'నరివెట్ట' సినిమా కూడా మొన్న శుక్రవారం విడుదల అయిన సంగతి చాలా మందికి తెలియదు. మైత్రి వారు సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసినా కూడా సరైన ప్రమోషన్స్ చేయక పోవడం వల్ల సినిమా జనాల్లోకి వెళ్లలేదు. నరివెట్ట అనే మలయాళ టైటిల్‌ కారణంగా కూడా తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. మలయాళంలో సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. లాంగ్‌ రన్‌లో కేరళలో కచ్చితంగా రూ.100 కోట్ల వసూళ్లను ఈ సినిమా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

నరివెట్ట మరేదైనా టైటిల్‌తో, పెద్దగా పోటీ లేని సమయంలో వచ్చి ఉంటే కచ్చితంగా ఫలితం మరోలా ఉండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టోవినో థామస్‌ తెలుగులో 2018, ఏఆర్‌ఎం, ఎల్‌ 2 సినిమాలు హిట్‌ కావడంతో నరివెట్టను ప్రమోట్‌ చేసి ఉంటే జనాల దృష్టిని ఆకర్షించి, మినిమం ఓపెనింగ్స్ దక్కేవి. తెలుగు బాక్సాఫీస్‌ వద్ద లాంగ్‌ రన్‌లో కచ్చితంగా మంచి వసూళ్లు రాబట్టి ఉండేది. కానీ మేకర్స్ తెలుగు వసూళ్లపై పెద్దగా ఫోకస్ చేసినట్లుగా అనిపించడం లేదు. అంతే కాకుండా నరివెట్ట సినిమా తెలుగు టైటిల్‌ విషయంలో కూడా మినిమం ఆలోచన చేయలేదు.

నరివెట్ట అనే పదం తెలుగులో కనీసం అవగాహన లేదు. అందుకే సినిమా గురించి తెలిసిన వారు కూడా ఇదేం టైటిల్‌ అని పెదవి విరుస్తున్నారు. మంచి సినిమాకు టైటిల్‌ పెద్ద మైనస్ కాగా, సినిమాను ఇక్కడ విడుదల చేసిన టైం కరెక్ట్‌ కాదు. మేకర్స్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ అనుభవం మిస్ అయ్యారు. సినిమాకు వస్తున్న పాజిటివ్‌ రెస్పాన్స్ నేపథ్యంలో చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఇప్పటి నుంచే ఎదురు చూడటం మొదలు పెట్టారు. ప్రమోషన్ చేయనిదానికి ఎందుకు తెలుగు రిలీజ్‌ చేసినట్లు అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.