మూవీ రివ్యూ : నారీ నారీ నడుమ మురారి
By: Tupaki Desk | 15 Jan 2026 12:45 AM IST'నారీ నారీ నడుమ మురారి' మూవీ రివ్యూ
నటీనటులు: శర్వానంద్ - సంయుక్త - సాక్షి వైద్య - నరేష్ - సంపత్ - వెన్నెల కిషోర్ - సత్య - సుదర్శన్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
కథ: భాను
మాటలు: నందు
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: రామ్ అబ్బరాజు
ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి చివరగా వచ్చిన సినిమా.. నారీ నారీ నడుమ మురారి. పండక్కి గట్టి పోటీ ఉన్నా సరే.. చాలా కాన్పిడెంటుగా ఈ సినిమాను పోటీలో నిలిపింది చిత్ర బృందం. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం.. ప్రోమోలు ఆకర్షణీయంగా ఉండడం.. సంక్రాంతికి ఇంతకుముందు వచ్చిన శర్వానంద్ సినిమాలు ఎక్స్ ప్రెస్ రాజా.. శతమానం భవతి ఘనవిజయాలు సాధించడం.. ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి. మరి బాలయ్య హిట్ మూవీ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా.. అంచనాలను అందుకుందా? శర్వాకు కోరుకున్న విజయాన్నందించిందా? తెలుసుకుందాం పదండి.
కథ:
గౌతమ్ (శర్వానంద్) ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఆర్కిటెక్ట్. తన కలీగ్ అయిన నిత్య (సాక్షి వైద్య)తో అతను ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డప్పటికీ.. నిత్య తండ్రికి వీరి పెళ్లి చేయడం ఇష్టముండదు. అయినా మాట వరసకు రిజిస్టర్ మ్యారేజ్ కు ఒప్పుకుని.. పెళ్లి తేదీలోపు ఏ చిన్న అవకాశం వచ్చినా గౌతమ్ అడ్డు తొలగించాలని చూస్తుంటాడు. ఈలోపు గౌతమ్ కాలేజీ రోజుల్లో ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కొన్ని రోజులకే విడిపోయిన దియా (సంయుక్త) తన జీవితంలోకి తిరిగి వస్తుంది. దీంతో గౌతమ్ పెద్ద సంకటంలో పడతాడు. దియా గురించి నిత్య.. ఆమె తండ్రికి తెలియకుండా మేనేజ్ చేయడానికి అతను ఎలాంటి పాట్లు పడ్డాడు.. నిత్యను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటి.. దియా నుంచి గతంలో అతనెందుకు విడిపోయాడు.. ఇప్పుడు ఆమె నుంచి తప్పించుకుని నిత్యను పెళ్లాడాడా లేదా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
కొత్త కథను ప్రయత్నించి రిస్క్ చేయడం కంటే.. అలవాటైన కథనే కొంచెం కొత్తగా చెప్పడం ద్వారా మ్యాజిక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు యువ దర్శకులు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా సాగే చిత్రాల్లో ఈ స్టయిలే ఫాలో అవుతుంటారు. ప్రధాన పాత్రలను బాగా తీర్చిదిద్దుకుంటే.. మంచి కామెడీ సిచువేషన్లను క్రియేట్ చేయగలిగితే.. ట్రెండీ వన్ లైనర్స్ యాడ్ చేస్తే.. ప్రేక్షకులకు నవ్వులకు ఢోకా ఉండదు. ‘నారీ నారీ నడుమ మురారి’ టీం సరిగ్గా ఈ పనే చేసింది. ఇంతకుముందు ‘సామజవరగమన’తో ప్రేక్షకులను భలేగా ఎంటర్టైన్ చేసిన దర్శకుడు రామ్ అబ్బరాజు.. రచయితలు భాను-నందు కలిసి మరోసారి మ్యాజిక్ చేశారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులూ మెచ్చే ట్రెండీ కామెడీతో ఈ త్రయం.. నాన్ స్టాప్ గా నవ్వించింది. విపరీతమైన హడావుడి.. హద్దులు దాటిన సన్నివేశాలు.. వెకిలి చేష్టలు.. డబుల్ మీనింగ్ డైలాగులు.. ఇవేవీ లేకుండా క్లీన్ ఫన్ తోనే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత. సంక్రాంతికి ఇంటిల్లిపాదీ ఆస్వాదించదగ్గ వినోదంతో మెప్పించిన శర్వానంద్ శర్వానంద్ ‘సంక్రాంతి హ్యాట్రిక్ హీరో’గా నిలిచాడు.
‘నారీ నారీ నడుమ మురారి’లో హీరో ఎక్స్ లవర్ పేరు.. దియా. తన పేరును అతను గుండె మీద పచ్చబొట్టు కూడా వేయించుకుంటాడు. కానీ తర్వాత ఆ అమ్మాయి నుంచి విడిపోయి.. కొన్నేళ్లకు మరో అమ్మాయిని పెళ్లాడడానికి సిద్ధమవుతాడు. అప్పుడు ఆ పచ్చబొట్టును చెరిపేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. కానీ టాటూ వేసే వ్యక్తి.. అది పర్మనెంట్ అని.. తీసేయడం సాధ్యం కాదని చెబుతాడు. తర్వాతి సీన్లో హీరోను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి వచ్చి అతడి ఒంటి మీద ఉన్న టాటూను చూసేస్తుంది. అప్పుడు హీరో ఎలా మేనేజ్ చేశాడో చూశాక.. ప్రేక్షకులు వావ్ అనుకోకుండా ఉండలేరు. ఈ సన్నివేశంలో మతలబు ఏంటన్నది ఇక్కడ చర్చిస్తే స్పాయిలర్ అవుతుంది. కానీ ‘నారీ నారీ నడుమ మురారి’ రచయితలు-దర్శకుడు కలిసి ఒక సన్నివేశాన్ని ఎంత బాగా రాసుకున్నారు.. ఎంత అందంగా కన్సీవ్ చేశారు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇలాంటి గమ్మత్తుగా అనిపించే.. కామెడీ బాగా పేలిన ఎపిసోడ్లు సినిమాలో ఐదారు దాకా ఉన్నాయి. ప్రస్తుతం టాప్ ఫాంలో ఉన్న సత్యతో హాస్పిటల్లో నడిచే ఒక ఎపిసోడ్లో అయితే కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటారు ప్రేక్షకులు. సినిమా కొంచెం నెమ్మదించినట్లు అనిపించినపుడల్లా మంచి ఎనర్జీ ఇచ్చే ఒక కామెడీ ఎపిసోడ్ పడడంతో ‘నారీ నారీ నడుమ మురారి’ ఎక్కడా బోరింగ్ అనిపించదు.
హీరో ఒకమ్మాయిని ప్రేమించడం.. ఆ తర్వాత తన జీవితంలోకి కొత్త అమ్మాయి రావడం.. ఆ పరిస్థితుల్లో పాత అమ్మాయి రీఎంట్రీ ఇవ్వడం.. ఈ లైన్లో తెలుగులో బోలెడన్ని స్టోరీలు చూశాం. ఇలాంటి కథల్లో హీరో మధ్యలో ఇరుక్కుని అవస్థలు పడడం.. ఒకరికి తెలియకుండా ఇంకొకరి దగ్గర మేనేజ్ చేసే క్రమంలో కన్ఫ్యూజన్ కామెడీతో చాలా సినిమాలే వచ్చాయి. అయినా సరే మొహం మొత్తని విధంగా.. ప్లెజెంట్ ఫీల్ ఇచ్చేలా ఇందులో సన్నివేశాలను రాసుకున్నారు. కథ పాతదే అయినా.. క్యారెక్టర్లు అన్న ఆసక్తికరంగా సాగడం వల్ల సినిమా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా నరేష్.. సత్య.. వెన్నెల కిషోర్ లాంటి సహాయ పాత్రలు ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉండడం వల్ల అవి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతాయి. ఈ పాత్రల మీద కామెడీ ఎపిసోడ్లన్నీ బాగా పేలాయి. మరోవైపు శర్వానంద్ సైతం తనదైన శైలిలో ఎంటర్టైన్ చేశాడు. అక్కడక్కడా కొన్ని సీన్లు రిపిటీటివ్ గా అనిపించడం.. ద్వితీయార్ధంలో నిడివి కొంచెం ఎక్కువ కావడం ‘నారీ నారీ నడుమ మురారి’కి మైనస్. కానీ ఇటు ఇద్దరు హీరోయిన్లతో హీరో లవ్ ట్రాక్స్ కానీ.. అటు కామెడీ ఎపిసోడ్లు బోర్ కొట్టించకుండా సాగడం.. ప్రి క్లైమాక్సులో ఎమోషన్లు కూడా బాగా వర్కవుట్ కావడం సినిమాకు కలిసొచ్చాయి. కోర్టు నేపథ్యంలో సాగే పతాక సన్నివేశాలు మంచి వినోదాన్నివ్వడంతో ప్లెజెంట్ ఫీల్ తో బయటికి వస్తారు ప్రేక్షకులు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ సంక్రాంతి సీజన్లో చివరి బంతికి సిక్సర్ కొట్టినట్లే.
నటీనటులు:
హిట్టు కొట్టి చాలా కాలం అయినా.. శర్వానంద్ లో కాన్ఫిడెన్స్ ఏమాత్రం చెదరలేదు. రన్ రాజా రన్.. ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలను గుర్తుకు తెచ్చేలా అతను మంచి ఫ్లోతో నటించాడు. తన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. లుక్స్ పరంగా చాలా స్టైలిష్ గా కనిపించడమే కాక.. నటనలోనూ స్టైల్ చూపించాడు. శర్వాను మళ్లీ ఇలాంటి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో చూడడం తన అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తుంది. హీరోయిన్లు ఇద్దరి పాత్రలూ బాగున్నాయి. సాక్షి వైద్యకు నటించే అవకాశం తక్కువగా లభించింది. ఆమె క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. సంయుక్త బాగా పెర్ఫామ్ చేసింది. అందంగానూ కనిపించింది. సీనియర్ నటుడు నరేష్ ను మరోసారి రామ్ అబ్బరాజు భలేగా వాడుకున్నాడు. తనకు టిపికల్ క్యారెక్టర్ రాసి.. హిలేరియస్ గా ప్రెజెంట్ చేశారు. సత్య.. వెన్నెల కిషోర్ తెరపై కనిపించినంతసేపూ నవ్వించారు. సుదర్శన్ కూడా బాగా చేశాడు. సిరి.. శ్రీకాంత్ అయ్యంగార్.. మిగతా నటీనటులు ఓకే.
సాంకేతిక వర్గం:
‘నారీ నారీ నడుమ మురారి’లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. శర్వా మార్కెట్ డౌన్ అయినా సరే.. ఈ సినిమాను మంచి క్వాలిటీతో తీశారు. జ్ఞానశేఖర్-యువరాజ్ కలిసి అందించిన ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. విజువల్స్ కంటికి ఇంపుగా.. కలర్ ఫుల్ గా ఉన్నాయి. ఐతే మంచి అభిరుచి ఉన్న సంగీత దర్శకుడిగా పేరున్న విశాల్ చంద్రశేఖర్.. తన స్థాయికి తగ్గ పాటలు మాత్రం ఇవ్వలేదు. సాంగ్స్ ఏవీ గుర్తుంచుకునేలా లేవు. మంచి పాటలు పడి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. విశాల్ నేపథ్య సంగీతం మాత్రం ఓకే. కథకుడు భాను.. మాటల రచయిత నందు.. ఇద్దరూ తమ ప్రతిభను చాటుకున్నారు. వీళ్లిద్దరితో దర్శకుడు రామ్ అబ్బరాజుకు బాగా సింక్ కుదిరినట్లు అనిపిస్తుంది. ఈ ముగ్గురూ కలిసి పాత్రలు.. కామెడీ సిచువేషన్లను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ప్లెజెంట్ టేకింగ్ తో రామ్ అబ్బరాజు మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. చాలా వరకు కామెడీ ప్రధానంగా సాగే ఈ కథకు ఇచ్చిన ఎమోషనల్ టచ్ కూడా ఆకట్టుకుంటుంది.
చివరగా: నారీ నారీ నడుమ మురారి.. వినోదాల వల్లరి
రేటింగ్ - 3/5
