Begin typing your search above and press return to search.

నారా రోహిత్ ప్రతినిధి 2.. ఎంతవరకు వచ్చిందంటే..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్తగా ఆకట్టుకునే హీరోలలో నారా రోహిత్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 7:08 AM GMT
నారా రోహిత్ ప్రతినిధి 2.. ఎంతవరకు వచ్చిందంటే..
X

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్తగా ఆకట్టుకునే హీరోలలో నారా రోహిత్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త తరహా పాయింట్ గురించి హైలెట్ చేస్తూ వస్తున్న ఈ హీరో సక్సెస్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గట్టిగానే ఉన్నప్పటికీ ఏ రోజు అటువైపు నుంచి అతను హడావిడి అయితే చేయలేదు.

వీలైనంతవరకు తన సొంత టాలెంట్ తోనే విభిన్న కథలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం కూడా అతను మరొక మంచి సందేశం ఇచ్చే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2014 లో వచ్చిన పొలిటికల్ డ్రామా 'ప్రతినిధి' సినిమా మంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ప్రతినిధి 2 రాబోతోంది.

ఈ సినిమా 4 నెలలుగా నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. నారా రోహిత్ చివరగా వీర భోగ వసంత రాయలు అనే సినిమా చేశాడు. ఇక అది విడుదలైన 5 సంవత్సరాలు అయ్యింది. తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రోహిత్ మంచి సీక్వెల్‌తో తిరిగి వస్తున్నాడు. ప్రతినిధి 2 సినిమా షూట్ ను ఆగస్టు చివరి వారంలో ప్రారంభించారు. ఇక ఇప్పుడు మొత్తానికి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.

ఈ సీక్వెల్‌కి సంబంధించిన ప్రత్యేకమైన అప్‌డేట్ కూడా వచ్చేసింది. ఇంకా షూటింగ్ పూర్తవ్వడానికి 3 రోజుల టాకీ పార్ట్ తో పాటు రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇటీవల హైదరాబాద్‌లోని పండ్ల మార్కెట్‌లో క్లైమాక్స్ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు మేకర్స్. ఇక ప్రతినిధి 2లో ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ మరియు న్యూస్ ప్రెజెంటర్ మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా నారా రోహిత్ మంచి విలువలు కలిగిన క్యారెక్టర్తో మెప్పించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమాజంలోని కొన్ని అంశాలను ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నారట. మరి ఈ సినిమాతో నారా రోహిత్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.