Begin typing your search above and press return to search.

నెలన్నర ఆలస్యంగా నాని అరాచకం..!

హిట్‌ 3 కంటే ముందు అనుకున్నా కూడా వీలు పడలేదు. హిట్ 3 విడుదల తర్వాత అయినా ది ప్యారడైజ్‌ వెంటనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు.

By:  Tupaki Desk   |   17 Jun 2025 10:33 AM IST
నెలన్నర ఆలస్యంగా నాని అరాచకం..!
X

నాని 'హిట్‌ 3' తో ఫ్యాన్స్‌కి షాక్‌ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరగా ఉంటూ వచ్చి, ఫ్యామిలీ హీరో అనే ఫీల్‌ కలిగించిన నాని హిట్‌ 3 లో చేసిన యాక్షన్‌ సీన్స్‌, మాట్లాడిన బూతులు కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేశారు, పిల్లలు హిట్ 3 సినిమాను చూడలేక పోవడంతో వారు కూడా నిరుత్సాహం వ్యక్తం చేశారు. హిట్‌ 3 సినిమా యాక్షన్‌లో హద్దులు దాటింది అంటే నాని తదుపరి సినిమా ది ప్యారడైజ్‌ అంతకు మించిన అరాచకం అన్నట్లుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా ఇంతకు ముందు దసరా సినిమా వచ్చింది. ఆ సినిమా చేసిన వెంటనే నానితో మరో సినిమాను చేసేందుకు గాను శ్రీకాంత్‌ కథను రెడీ చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. హిట్‌ 3 కంటే ముందు అనుకున్నా కూడా వీలు పడలేదు. హిట్ 3 విడుదల తర్వాత అయినా ది ప్యారడైజ్‌ వెంటనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు.

ఇప్పటి వరకు ది ప్యారడైజ్ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌కి ముందు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్నాయి. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల బడ్జెట్‌ తగ్గించడం కోసం ఎక్కువగా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. నాని సైతం హిట్‌ 3 సినిమా హ్యాంగోవర్‌ నుంచి కాస్త రిలాక్స్ కావాలి అనుకున్నాడు. అందుకే ఇప్పటి వరకు సినిమా సెట్స్‌ పైకి వెళ్లలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే నెల నుంచి షూటింగ్‌ ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. నాని నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే వచ్చే నెలలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ కాస్త అటు ఇటు అయితే జులై కాకుండా ఆగస్టు నుంచి పక్కాగా ది ప్యారడైజ్ సినిమా పట్టాలు ఎక్కడం ఖాయం.

ముందుగా అనుకున్న ప్రకారం మే నెలలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించక పోవడంతో 'ది ప్యారడైజ్‌' సినిమాను ముందుగా అనుకున్న తేదీకి విడుదల చేయడం సాధ్యం కాదు. అందుకే సినిమాను ముందుగా అనుకున్నట్లు మార్చి 26, 2026న కాకుండా నెలన్నర ఆలస్యంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా త్వరలోనే తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సమ్మర్‌ హాలీడేస్‌ను వినియోగించుకునే విధంగా సినిమాను మే నెలలో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. 2026 మే నెలలో పలు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాని సినిమా అదే నెలలో కన్ఫర్మ్‌ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇతర సినిమాలు సైడ్‌ అవుతాయా లేదంటే పోటీకి వస్తాయా అనేది చూడాలి.

శ్రీకాంత్‌ ఓదెల 'ది ప్యారడైజ్‌' సినిమా తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో సినిమాను చేయాల్సి ఉంది. అందుకే మరీ ఎక్కువ ఆలస్యం చేయకుండా ది ప్యారడైజ్ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడట. అందుకు నాని నుంచి కూడా సహకారం ఉంటుంది. ఎందుకంటే శ్రీకాంత్‌ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమాను నాని స్వయంగా నిర్మించబోతున్నాడు. అందుకే నాని త్వరగా తన ప్యారడైజ్ సినిమాను పూర్తి చేసి శ్రీకాంత్‌ను చిరంజీవి సినిమాకి సంబంధించిన పనులు మొదలు పెట్టించాలని భావిస్తున్నారు. ది ప్యారడైజ్ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ మొత్తం అంచనాలను మార్చేసింది. బాబోయ్ నాని నుంచి మరీ ఇంత మాస్‌ యాంగిల్‌, వైడ్ యాంగిల్‌ ను చూడగలమా అని అంతా అనుకుంటున్నారు. ఇదే సమయంలో హిట్ 3 ను మించిన అరాచకంగా ది ప్యారడైజ్‌ వస్తుందని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే నెలన్నర ఆలస్యంగా నాని అరాచకం మొదలు కాబోతుంది.