వరుస సక్సెస్‌లతో బిజీగా ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ఓ వైపు హీరోగా సక్సెస్‌లతో దూసుకెళ్తున్న నాని, రీసెంట్ గా కోర్టు సినిమాను నిర్మించి బ్లాక్ బస్టర్ తీర్పును అందుకున్నాడు. ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో సొంత బ్యానర్ లో హిట్3 సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. హిట్3 మూవీ ఒక స్టైలిష్ బ్రూతల్ ఫిల్మ్ అని, ఆల్రెడీ రిలీజైన టీజర్ చూస్తే హిట్3 ఏ రేంజ్ లో ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చేస్తుందని నాని చెప్పాడు.
హిట్3 తర్వాత నాని, తనకు దసరా లాంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ సినిమా చేయనున్నాడని అందరికీ తెలుసు. ఆ సినిమా కోసం నాని తన లుక్ ను పూర్తిగా మార్చేసి అందరికీ షాకిచ్చాడు. రీసెంట్ గా ప్యారడైజ్ నుంచి రిలీజైన రా స్టేట్‌మెంట్ కు ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఇంటర్వ్యూలో నాని ది ప్యారడైజ్ గురించి మాట్లాడి సినిమాపై ఉన్న హైప్ ను అమాంతం పెంచేశాడు. ది ప్యారడైజ్ దసరా కంటే భారీగా ఉండబోతుందని, శ్రీకాంత్ ఈసారి చాలా భారీగా ప్లాన్ చేసుకున్నాడని, సినిమా మొత్తం నెక్ట్స్ లెవెల్ ఎనర్జీ క్యారీ అవుతుందని, ప్రతీ సీన్ చాలా హై ఇస్తుందని, ది ప్యారడైజ్ లో ఎవరూ ఊహించని ఎలిమెంట్స్ చాలా ఉంటాయని నాని వెల్లడించాడు.
ప్రస్తుతం తాను ది ప్యారడైజ్ లుక్ కోసం మేకోవర్ అవుతున్నానని చెప్పిన నాని, ఆ సినిమాతో ఆడియన్స్ అందరూ షాకవుతారని చెప్తున్నాడు. త్వరలోనే ది ప్యారడైజ్ షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పిన నాని, ఆ సినిమాను వచ్చే ఏడాది మార్చి 26న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నాడు. దీంతో పాటూ చిరంజీవితో తాను నిర్మించబోయే సినిమా గురించి కూడా నాని ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
చిరంజీవి గారి సినిమా గురించి అప్పుడే మాట్లాడటం చాలా తొందరపడినట్టు అవుతుందని అంటున్న నాని, మెగాస్టార్ తో నిర్మాతగా సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని, ఒక నటుడిగా ఇది తనకు చాలా పెద్ద బాధ్యత అని, ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. చిరంజీవి అందరికీ ఫ్యామిలీ మెంబర్ లాంటి వారని, ఆయన డ్యాన్స్, యాక్షన్ తో ఎంతో ఫేమస్ అయ్యారని, అలాంటి మెగాస్టార్ తో తాము చాలా పెద్ద ప్రాజెక్ట్ చేయనున్నామని, మెగాస్టార్ పై శ్రీకాంత్ కు ఉన్న పిచ్చి మొత్తాన్ని ఆ సినిమాలో చూస్తారని, ఈ ప్రాజెక్టు చేయడం చాలా గర్వంగా ఉందని, నెక్ట్స్ ఇయర్ నుంచి మెగాస్టార్- శ్రీకాంత్ ఓదెల సినిమా మొదలవనుందని తెలిపాడు నాని. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్టు నాని వెల్లడించాడు.