Begin typing your search above and press return to search.

తమిళ దర్శకుడితో మూవీ.. నాని ఏమన్నాడంటే..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   25 April 2025 7:39 AM
Nani Confirms Talks with Director Cibi Chakravarthi
X

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ అనే పాత్రలో నాని వయొలెంట్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాని నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో నాని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూలో నాని, తన తదుపరి ప్రాజెక్టుల గురించి వివరించారు. ప్రస్తుతం నాలుగు స్క్రిప్టులపై చర్చలు జరుగుతున్నాయనీ, వాటిలో ఏది ముందుగా సెట్స్ మీదకి వెళుతుందో ఇంకా తేలలేదన్నారు. ఈ మధ్యకాలంలో నానికి సంబంధించి తమిళ దర్శకుడు సీబి చక్రవర్తితో ఓ సినిమా చర్చల్లో ఉందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఇదే ప్రశ్నను అడిగినప్పుడు నాని ప్రత్యక్షంగా స్పందిస్తూ, “అది రూమర్ కాదు. మేము నిజంగా చర్చల మధ్యలో ఉన్నాం,” అని పేర్కొన్నారు.

“మేము చాలా రోజులుగా నాలుగు ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నాం. కానీ వాటిలో ఏది ముందుగా మొదలవుతుందో చెప్పలేము. సీబితో ప్రాజెక్ట్ గురించి మాత్రం చాలా ఆసక్తిగా ఉన్నా,” అని నాని తెలిపారు. ఈ ప్రకటనతో ఆ ప్రాజెక్ట్ అధికారికంగా దాదాపు కన్ఫర్మ్ అయినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. సీబి చక్రవర్తి గతంలో డాన్ అనే తమిళ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ప్రత్యేకమైన కథ చెప్పే విధానం నానికి నచ్చిందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక హిట్ 3 విషయానికొస్తే, ఇందులో నాని పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. అయితే నిర్మాతగా వ్యవహరించినప్పటికీ, తనలోని నిర్మాతను పూర్తిగా పక్కనబెట్టి నటనపైనే దృష్టి పెట్టానని నాని అన్నారు. “నేను సెట్లో ఉన్నప్పుడు నిర్మాత కాదు, నటుడిగా ఉంటాను. ఈ సినిమా కోసం ఏది కావాల్సినదైనా ఇచ్చాను. కానీ నిర్మాతగా ఎక్కువగా కనిపించలేదు,” అని చెప్పారు.

క్రియేటివ్ వర్క్ మీద ఎక్కువగా ఆసక్తి చూపే తాను, టెక్నికల్ డీటెయిల్స్, డీల్స్ విషయంలో తన టీమ్‌కే పూర్తి బాధ్యతలు ఇచ్చానని నాని తెలిపారు. “ఒకసారి డిస్ట్రిబ్యూషన్, ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని టీమ్ చెబితే, సింపుల్‌గా సైన్ చేస్తాను. ఎక్కువ ఆలోచించను. నటుడిగా నా పనిలోనే మునిగిపోతాను,” అని నాని చెప్పారు. ఈ మాటలతో నాని తన పాత్రల్లో ఎంతగా ఇమిడిపోతాడో, అలాగే తన సినిమాలపై చూపే నిబద్ధత ఏ రేంజ్‌లో ఉంటుందో స్పష్టమవుతోంది. హిట్ 3 తర్వాత ప్యారడైజ్, సుజీత్ ప్రాజెక్ట్, ఇప్పుడు సీబి చక్రవర్తి మూవీ వంటి ఇంట్రెస్టింగ్ లైనప్‌తో నాని మరోసారి తన పవర్ఫుల్ లైనప్ ను చూపిస్తున్నారు.