Begin typing your search above and press return to search.

‘ప్యారడైజ్’కు ఆకాశమే హద్దు

టాలీవుడ్లో నిలకడగా విజయాలు అందుకుంటూ.. సినిమా సినిమాకూ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న హీరో అంటే నానినే అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   7 May 2025 7:00 AM IST
Nani’s HIT-3 Success Sets the Stage for Paradise
X

టాలీవుడ్లో నిలకడగా విజయాలు అందుకుంటూ.. సినిమా సినిమాకూ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న హీరో అంటే నానినే అని చెప్పాలి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ.. మంచి అభిరుచితో సినిమాలు చేస్తూ, నటుడిగా గొప్ప పేరు సంపాదించి.. ఈ రోజు పెద్ద స్టార్లలో ఒకడిగా నిలబడ్డాడు నాని. తన కొత్త చిత్రం ‘హిట్-3’కి జరిగిన బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్.. వచ్చిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలు షాకయ్యాయి. సినిమాకు పూర్తి పాజిటివ్ లేకపోయినా.. కొంత మిక్స్డ్ టాక్ కూడా వచ్చినా వసూళ్లకు ఢోకా లేకపోయింది.

తొలి వీకెండ్లోనే వంద కోట్ల వసూళ్లతో ఔరా అనిపించింది. నాని కెరీర్లో దసరా తర్వాత ఇది రెండో వంద కోట్ల సినిమా. కేవలం నాలుగో రోజే వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టాడంటే నాని రేంజ్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. హిట్-3తో టాలీవుడ్లో మోస్ట్ బ్యాంకబుల్ స్టార్లలో ఒకడిగా నాని గుర్తింపు సంపాదించాడు.

బాక్సాఫీస్ దగ్గర హిట్-3 దూకుడు చూశాక.. నాని తర్వాతి చిత్రం ‘ది ప్యారడైజ్’ ఇంకెంత సంచలనం రేపుతుందో అన్న చర్చ జరుగుతోంది. ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే ఈ సినిమాకు బంపర్ క్రేజ్ వచ్చింది. కొన్ని నెలల కిందట వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపింది. టాప్ హీరోల సినిమాల రేంజిలో ఆ టీజర్ చర్చనీయాంశంగా మారింది. దసరాను మించిన రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో ఈ సినిమా తీయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. నాని కూడా ఈ సినిమా గురించి ఇంటర్వ్యూల్లో ఒక రేంజిలో ఎలివేషన్ ఇస్తున్నాడు.

వచ్చే సమ్మర్ సీజన్లో సినిమా రాబోతోంది. మంచి రిలీజ్ డేట్ ఎంచుకున్నారు. వచ్చే ఏడాది కాలంలో మరింత ఎగ్జైటింగ్ కంటెంట్ ఇచ్చారంటే.. సినిమా హైప్ వేరే లెవెల్‌కు వెళ్లడం ఖాయం. పాన్ ఇండియా స్థాయిలో బజ్ తీసుకురాగలిగితే వసూళ్ల పరంగా దీని లెక్కలే వేరుగా ఉంటాయేమో. ఒకేసారి నాని వంద కోట్ల ఓపెనింగ్ మీద గురి పెట్టొచ్చు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. నానికి తొలి 200 కోట్ల సినిమాగానూ ఇది నిలిచే అవకాశముంది.