విశ్వక్‌సేన్‌తో వివాదంపై నాని క్లారిటీ
టాలీవుడ్‌లోని అగ్ర హీరోలకు దీటుగా స్వయం కృషితో ఎదుగుతున్న నేచరల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్-3 ప్రమోషన్స్ లో తీరిక లేకుండా ఉన్నాడు.
By: Tupaki Desk | 26 April 2025 5:30 PMటాలీవుడ్‌లోని అగ్ర హీరోలకు దీటుగా స్వయం కృషితో ఎదుగుతున్న నేచరల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్-3 ప్రమోషన్స్ లో తీరిక లేకుండా ఉన్నాడు. నాని హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే నెల 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండడం తెలిసిందే. ఈ సినిమాకు నానినే నిర్మాత కూడా కావడం విశేషం. తన వాల్ పోస్టర్ బ్యానర్‌లో కొత్త నటీనటులు, దర్శకులను నాని ఇండస్ట్రీకు పరిచయం చేస్తూ యంగ్ టాలెంట్‌ను యంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా కోర్టు సినిమాను తన బ్యానర్‌లో నిర్మించి, ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని.
నాని నిర్మాతగా తెరకెక్కించిన హిట్1, హిట్2 చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్యామిలీ హీరోగానే అభిమానుల మన్ననలు పొందిన నాని ఆ తర్వాత దసరా వంటి పక్కా మాస్ జాతర సినిమాతో అన్ని వర్గాలకు చేరవయ్యాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు సాధించిన నాని ఇప్పుడు హిట్-3తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హిట్ సిరీస్‌లో తొలి చిత్రాన్ని విశ్వక్‌సేన్‌తో, రెండో సినిమాను అడివి శేష్‌తో నాని నిర్మించాడు. అయితే, విశ్వక్ సేన్‌తో వచ్చిన బేధాభిప్రాయాలు కారణంగానే అతడి స్థానంలో హిట్-2 శేష్‌ను హీరోగా పెట్టారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. దీనిపై హిట్-3 ప్రమోషన్స్‌లో నాని స్పష్టత ఇచ్చాడు.
విశ్వక్ సేన్‌తో ఎలాంటి గొడవలు, అభిప్రాయబేధాలు లేవని నాని స్పష్టం చేశాడు. హిట్-1 సినిమాకు కథ సిద్ధం కాకముందే విశ్వక్‌ను హీరోగా అనుకున్నామని చెప్పాడు. ఆ తర్వాత ఆ సిరీస్ పెద్దగా మారిపోవడంతో రెండో పార్ట్‌కు అడివి శేష్‌ను హీరోగా తీసుకురావాల్సి వచ్చిందని తెలిపాడు. అసలు హిట్ సిరీస్‌ను ఒక్క హీరోను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది కాదని, అందుకే మూడో పార్ట్‌లో తాను నటిస్తున్నానని వివరణ ఇచ్చాడు. భవిష్యత్‌లో మళ్లీ విశ్వక్‌సేన్, శేష్ తిరిగి ఈ సిరీస్‌లోకి వస్తారేమో కథను బట్టి వేచి చూడాల్సి ఉందన్నాడు.
నిర్మాతగా తాను ఇకపై తెరకెక్కించే ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తానని చెప్పిన నాని, ప్రమోషన్స్ ను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తానని తెలిపాడు. హిందీలో తన చిత్రాలు విఫలమయ్యానని కొందరు విమర్శిస్తున్నారని, అయితే తెలుగు సినిమాల సత్తాను హిందీలోనూ నిరూపించడానికి తాను కష్టపడుతున్నానని చెప్పారు. ఇక, హిట్-3 చిత్రానికి కొలను శైలేష్ దర్శకత్వం వహించగా, కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. మిక్కీ జే.మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.