Begin typing your search above and press return to search.

ఎలక్షన్ లోపు.. బాలయ్య ముందున్న టార్గెట్ ఇదే..

ఈ మూవీలో బాలయ్య మేకోవర్ ఫుల్ డిఫరెంట్‌గా ఉండేలా బాబీ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   12 March 2024 2:37 PM GMT
ఎలక్షన్ లోపు.. బాలయ్య ముందున్న టార్గెట్ ఇదే..
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్లు కొట్టిన బాలయ్య.. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 1980 బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. ఈ మూవీలో బాలయ్య మేకోవర్ ఫుల్ డిఫరెంట్‌గా ఉండేలా బాబీ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన బ్లాస్టింగ్ ట్రీట్ ఫస్ట్ గ్లింప్స్ తో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో బాలయ్య పాన్ ఇండియా జోన్ కు ఎంట్రీ ఇస్తున్నట్టుగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా రివీల్ చేసింది. యాక్షన్ అండ్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవల యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత రాజస్థాన్ తో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది.

ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ షెడ్యూల్ లో బాలయ్య కంటిన్యూగా పాల్గొంటున్నారు. ఇక మేకర్స్ కూడా ఈ సినిమా షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానుంది. దీంతో ఏపీలో తెలుగుదేశం పార్టీ తరఫున బాలయ్య ప్రచారం చేయనున్నారు.

అయితే ఏపీలో బాలయ్య.. ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనేది ఇంకా పార్టీ హైకమాండ్ ఫిక్స్ చేయలేదట. దీంతో అప్పటి వరకు ఆయన షూటింగ్ లో పాల్గొనున్నారట. ప్రచారం మొదలు పెట్టాక.. షూటింగ్ కు నెలరోజులపాటు గ్యాప్ ఇవ్వనున్నారట. మళ్లీ ఎన్నికల తర్వాత షూటింగ్ లో పాల్గొనున్నారట. అందుకే శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారట మేకర్స్. దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాణీలు కడుతున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. మరి హ్యాట్రిక్ హిట్ లు కొట్టిన బాలయ్య.. ఈ సినిమాతో ఎలా అలరిస్తారో చూడాలి.