Begin typing your search above and press return to search.

నందమూరి నాలుగోతరం హీరో.. ఫైనల్ గా మొదలెట్టేశాడు

ఈసారి ఎంతో ప్రత్యేకంగా.. నందమూరి ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగో తరం హీరోని వెండితెరకు పరిచయం చేస్తుండడం విశేషం.

By:  Tupaki Desk   |   12 May 2025 6:46 AM
నందమూరి నాలుగోతరం హీరో.. ఫైనల్ గా మొదలెట్టేశాడు
X

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సీతయ్య, దేవదాసు లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు వైవీఎస్ చౌద‌రి. చాలా కాలం తరువాత అతను మళ్ళీ యాక్షన్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎంతో ప్రత్యేకంగా.. నందమూరి ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగో తరం హీరోని వెండితెరకు పరిచయం చేస్తుండడం విశేషం. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద వైవీఎస్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ మనవడు.. జానకీ రామ్ కుమారుడు.. తెరంగేట్రం చేయనున్నాడు. ఆ యువ నటుడికి తాత ఎన్టీఆర్ పేరు మాత్రమే కాదు, ఆశీస్సులు కూడా వారసత్వంగా వస్తున్నాయని మేకర్స్ తెలియజేశారు. వీణారావు అనే కొత్త కథానాయిక కూడా ఈ సినిమాలో పరిచయం అవుతుంది.

ఈ వేడుకకు నందమూరి కుటుంబంలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టగా, మోహనకృష్ణ ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించారు. పురందేశ్వరి, వసుంధరదేవి, రామకృష్ణ, మోహనరూప, గారపాటి లోకేశ్వరి లాంటి కుటుంబ సభ్యులు పూర్ణంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎన్టీఆర్ వారసుడు రామ్ కు తమ ఆశీస్సులు అందజేశారు. “తాతగారి లెగసీని ఈ తరం కొనసాగించాలని” వారు ఆకాంక్షించారు.

వైవీఎస్ మాట్లాడుతూ..ఇది ఒక సినిమా కాదు. ఇది తెలుగు సంస్కృతి, హైందవ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందుతున్న ప్రాజెక్ట్. కీరవాణి సంగీతం, సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ లాంటి అగ్రశ్రేణి టెక్నీషియన్స్ తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.. అని అన్నారు. ఎన్టీఆర్ పేరు వింటేనే గౌరవం, గర్వం కలుగుతోందని, ఆ బాధ్యతతోనే ఈ కథను తెరకెక్కిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఈ సినిమా ప్రారంభం నేపథ్యంలో నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ “25 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందు రావడం ఒక అనుభూతి. నా మనవడి ఫస్ట్ షాట్ కు కెమెరా పట్టడం గర్వంగా ఉంది. నాన్న ఎన్టీఆర్ పేరు, స్థాయిని నిలబెట్టేలా ఈ తరం కూడా కృషి చేస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు. జానకీ రామ్ కుమారుడిగా పుట్టిన ఎన్టీఆర్ బాల్యం నుంచే నటనపై ఆసక్తి కలిగి ఉండటాన్ని గుర్తు చేశారు.