Begin typing your search above and press return to search.

నందమూరి 4వ తరం ఎన్టీఆర్.. లాంచ్ లో ఎమోషనల్ మూమెంట్!

తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో సర్ ప్రైజ్ రాబోతోంది.

By:  Tupaki Desk   |   12 May 2025 1:30 PM IST
Fourth Generation Nandamuri Hero Debuts
X

తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో సర్ ప్రైజ్ రాబోతోంది. ఇప్పుడు నాలుగో తరం నందమూరి వారసుడి ఎంట్రీని చూడబోతున్నాం. నందమూరి హరికృష్ణ కుమారుడు, జానకీరామ్ తనయుడు ఎన్టీఆర్ ఇప్పుడు హీరోగా తెరపైకి రానున్నాడు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ చిత్రానికి గ్రాండ్‌గా పూజా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సినిమా ప్రారంభోత్సవానికి కుటుంబం అంతా తరలివచ్చారు. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టగా, నందమూరి మోహనకృష్ణ మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి కుటుంబ సభ్యులు ఇలా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ అట్టహాస వేడుకలో కొత్త ఎన్టీఆర్ చెప్పిన మాటలు అందరి హృదయాల్ని తాకాయి.

తన తొలి సినిమాలో మొదటి అడుగుపెడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, “మా ముత్తాత నందమూరి తారకరామారావు గారు, ఆయన పక్కనే నిలబడి చూసే మా తాత హరికృష్ణ గారు, అలాగే మా నాన్న జానకీరామ్ గారి ఆశీస్సులు ఎప్పటికీ నాతో ఉంటాయనే నమ్మకం నాలో ఉంది” అని అన్నారు. ఈ మాటలు వినగానే అక్కడి వారందరికీ ఓ భావోద్వేగం వెల్లివచ్చింది. మూడు తరాల వారసత్వాన్ని కళ్లముందు నిలిపినట్టయింది.

అంతేకాదు, “ఈరోజు మా తాతలు, అమ్మమ్మలు, బాబాయిలు, మొత్తం కుటుంబం నన్ను ప్రోత్సహిస్తూ నాకు సపోర్ట్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నేను వేయబోయే ప్రతి అడుగుకూ వాళ్ల ఎంకరేజ్మెంట్ తోడై ఉంటుంది. ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్” అంటూ భావోద్వేగంగా తెలిపారు. ఈ స్పష్టమైన అభిప్రాయాలు చూసి, ఈ తరం ఎన్టీఆర్‌లోనూ తన కుటుంబ విలువలు, సినీ గౌరవం పట్ల నిబద్ధత కనపడుతోంది.

ఎన్టీఆర్ మొదటి సినిమాను ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి రూపొందిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి, రచయిత సాయిమాధవ్ బుర్రా వంటి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు బలంగా నిలుస్తోంది. నాలుగో తరం ఎన్టీఆర్ తొలి అడుగుతోనే తనదైన గుర్తింపు తెచ్చుకుంటాడా అనే ఆసక్తి తెలుగు ప్రేక్షకులలో ఇప్పటికే మొదలైంది. మరి ఈ కుర్రాడు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సర్ ప్రైజ్ లు ఇస్తాడో చూడాలి.