ఆ సినిమా ఎన్టీఆర్ కుటుంబమంతా కలిసి తీసింది..
అలాంటి తరుణంలో నాన్నగారు లేకపోయినా ఆయన సినీ వారసత్వాన్ని కొనసాగించాలని కుటుంబం మొత్తం కలిసి ఒక చిత్రం నిర్మించాలని భావించిందట.
By: Tupaki Desk | 10 April 2025 6:00 PM ISTతెలుగు చిత్రసీమతో నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్దాయన నందమూరి తారాక రామారావు దగ్గర నుంచి ఆ తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఇలా ఆయన వారసత్వం తెలుగు సినీ పరిశ్రమను ఏలుతూ వస్తోంది. అయితే, కుటుంబ పెద్ద స్వర్గీయ ఎన్.టి.రామరావు 1996 కాలం చేసిన తర్వాత ఆ కుటుంబం మొత్తం తీవ్రమైన దుఃఖం మునిగిపోయింది.
అలాంటి తరుణంలో నాన్నగారు లేకపోయినా ఆయన సినీ వారసత్వాన్ని కొనసాగించాలని కుటుంబం మొత్తం కలిసి ఒక చిత్రం నిర్మించాలని భావించిందట. బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ శరత్ నేతృత్వంలో పెద్దన్నయ్య అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో నందమూరి రామకృష్ణ నిర్మాతగా సినిమాను తెరకెక్కించారు. 1997లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
భారీ కలెక్షన్లను సాధించిన ఆ సినిమా సక్సెస్ తన ఒక్కడిదే కాదని, ఎన్టీఆర్ కుటుంబమంతా కలిసి ఈ సినిమాను రూపొందించిందని నిర్మాత రామకృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బాలన్నయ్య ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారని, అందులో పెద్దన్నయ్య పాత్ర మెకప్ టెస్టు చేసినప్పుడు పంచెకట్టులో అన్నయ్య అచ్చం నాన్నగారిలా కనిపించారని, అప్పుడే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని భావించామన్నారు. నాన్నగారే అదృశ్య శక్తిలా పైనుంచి అన్నీ తానై ఈ సినిమా గొప్ప విజయం సాధించేలా ముందుకు నడిపించారని చెప్పారు.
పెద్దన్నయ్య రామకృష్ణ 1962లోనే కాలం చేశారని, ఆయన తర్వాత పుట్టిన రామారావుగారి సంతానం జయకృష్ణ, లోకేశ్వరి, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ (సినిమాటోగ్రాఫర్), పురంధేశ్వరి, బాలకృష్ణ, భువనేశ్వరి, రామకృష్ణ, ఉమామహేశ్వరి, జయశంకర్ కృష్ణ అంతా కలిసికట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయం సాధించామని చెప్పారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ మోహనకృష్ణ అన్నయ్యేనని, రామకృష్ణ స్టూడియోస్‌లో నిర్మించిన అన్నీ సినిమాలకీ ఆయనే సినిమాటోగ్రాఫర్ అని చెప్పారు.
