పద్మ పురస్కారానికి ఇదే సరైన సమయం
అలాంటి బాలయ్య సోమవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ను అందుకున్నారు.
By: Tupaki Desk | 29 April 2025 12:20 PM ISTవరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ వారితో పోటీ పడుతున్నారు. కేవలం సినిమాల్లో నటన మాత్రమే కాకుండా అన్‌స్టాపబుల్ అనే షో కు హోస్ట్ గా కూడా వ్యవహరించి తన వాక్చాతుర్యంతో ఆ షో ను రక్తి కట్టించారు బాలయ్య.
అలాంటి బాలయ్య సోమవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ను అందుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలయ్యకు ఈ పురస్కారాన్ని ప్రధానం చేయగా, బాలయ్య ఆ అవార్డు తీసుకున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే బాలయ్య ఈ అవార్డును అందుకోవడానికి వెళ్లినప్పుడు ఆయనేమీ సూటు, బూటు వేసుకుని వెళ్లలేదు. తెలుగు వారి గర్వాన్ని ప్రపంచానికి తెలియచేయాలనే బాధ్యతను తన భుజాలపై వేసుకుని సాంప్రదాయ పంచెకట్టు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అవార్డు తీసుకున్న అనంతరం బాలయ్య తనకొచ్చిన పద్మ పురస్కారం గురించి మాట్లాడారు.
పద్మ పురస్కారం రావడంతో తాను, తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నామని, దీనికి కారణమైన నా ఫ్యాన్స్ కు, ఇండియన్ గవర్నమెంట్ కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. తన అభిమానులు మాత్రం తనకు ఈ అవార్డు ముందుగానే వచ్చి ఉండాల్సిందని అనేవారని, దానికి తాను వరుసగా నాలుగు హిట్ సినిమాలు రావడం, రీసెంట్ గానే ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం, ఎమ్మెల్యేగా మూడు సార్లు విన్ అవడం, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ అయి 15 ఏళ్లు అయిన ఈ సందర్భమే సరైనదని చెప్పానని చెప్పారు.
ఇక సినిమాల విషయానికొస్తే బాలయ్య తన తర్వాతి సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 తాండవం సినిమా చేస్తున్న బాలయ్యా ఈ సినిమాతో మరోసారి తమ కాంబినేషన్ లో హిట్ అందుకోవాలని చూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న అఖండ2 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
