రామాయణం: నేటి జెన్ Z నిర్మాతలకు నమిత్ పట్టుదల-కసి ఆదర్శం కావాలి!
ఎవరి గురించి అయినా నెగెటివ్‌గా కామెంట్ చేయడం చాలా సులువు.. కానీ నమిత్ పట్టుదలను..ఆయనలోని కసిని నిజాయితీగా పరిశీలిస్తే ఎవరైనా సరే ఆ ప్రయత్నాన్ని అభినందించకుండా ఉండలేరు.
By: Sivaji Kontham | 19 July 2026 5:02 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ రీతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం `రామాయణం`. ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో ఈ చిత్ర నిర్మాత, DNEG సీఈఓ నమిత్ మల్హోత్రా మాట్లాడిన మాటలు సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హాలీవుడ్ పరిశ్రమ భారతీయ సినిమాను తక్కువ చేసి మాట్లాడటం చూశాక... ఎంతో కసితో మన సినిమాను కూడా హాలీవుడ్ స్థాయికి ధీటుగా తీసుకెళ్లాలనే ఒక ఉత్తమమైన లక్ష్యంతో నమిత్ ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరి గురించి అయినా నెగెటివ్‌గా కామెంట్ చేయడం చాలా సులువు.. కానీ నమిత్ పట్టుదలను..ఆయనలోని కసిని నిజాయితీగా పరిశీలిస్తే ఎవరైనా సరే ఆ ప్రయత్నాన్ని అభినందించకుండా ఉండలేరు.
మనం భారతదేశంలో ఎంతగా గర్వంగా చెప్పుకుంటున్నా.. కలెక్షన్ల పరంగా, మార్కెట్ విస్తృతి పరంగా మన చిత్రాలు ఇంకా హాలీవుడ్ స్థాయిని అందుకోలేదనే చేదు నిజం అంగీకరించాలి. హాలీవుడ్‌లో అవతార్, అవెంజర్స్ వంటి ఫ్రాంచైజీలు సాధించినట్లు బిలియన్ డాలర్ల వసూళ్లు అనేవి భారతీయ చిత్రసీమకు ఇంకా కలగానే మిగిలిపోయాయి. అందుకే నమిత్ మల్హోత్రా లాంటి యువతరం పట్టుదల, కసి నుంచి ఇలాంటి భారీ లక్ష్యాలను ఛేదించే ప్రయత్నాలు జరగడం నేడు అత్యంత ఆవశ్యకం. మన భారతీయ పురాణేతిహాసమైన `రామాయణా`నికి ప్రపంచ మార్కెట్‌ను శాసించే ఆ స్థాయి -సత్తా ఖచ్చితంగా ఉన్నాయి.
రామాయణం అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా.. ప్రపంచం మొత్తానికి తెలిసిన ఒక అద్భుతమైన పురాణేతిహాస కథ. అందువల్ల ఈ కథను ప్రపంచంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం నిర్మాత నమిత్ మల్హోత్రా చేస్తున్న ప్రయత్నం కూడా ఇదే. ముంబైలోని ఒక చిన్న గ్యారేజీలో కేవలం ముగ్గురు అబ్బాయిలతో ప్రయాణం మొదలుపెట్టి... నేడు ఏకంగా 7 ఆస్కార్ అవార్డులు గెలుచుకునే స్థాయికి ఎదిగిన నమిత్... హాలీవుడ్ వాళ్ల కామెంట్లను తట్టుకోలేక కసితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న మన సినిమాను హాలీవుడ్ తక్కువగా చూడటాన్ని సవాలుగా తీసుకుని ఆయన వేస్తున్న ఈ అడుగులకు శభాష్ అని అభినందించాల్సిందే.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే క్రమంలో నమిత్ ఎక్కడా రాజీ పడటం లేదు. రామాయణంలో దాదాపు 300కు పైగా విభిన్న వెర్షన్లు ఉన్నందున... ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు పండితులు, నిపుణుల సలహాలు తీసుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సాధారణంగా సినిమాలు నిర్మించేటప్పుడు వయసు, లింగం వంటి సమీకరణాలు లెక్కలు వేసుకుంటారు. కానీ నమిత్ ఈ చిత్రాన్ని కథను నమ్మేవాళ్లతో పాటు నమ్మని వాళ్లకు కూడా కనెక్ట్ అయ్యేలా తీస్తున్నారు. లండన్, అమెరికా వంటి దేశాల్లో చదివే మన పిల్లలు రేపు ఈ సినిమా చూస్తే..`ఇది మా భారతదేశ కథ` అని ఎంతో గర్వంగా చెప్పుకునేలా దీనిని అద్భుతమైన విజువల్స్‌తో నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గారి చిత్రాల స్ఫూర్తిని కూడా నమిత్ కొనియాడారు. రాజమౌళి ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని...RRR సినిమాతో హాలీవుడ్ సైతం మన కథలను గౌరవించేలా చేశారని ఆయన గతంలోనే దర్శకధీరుడిని అభినందించారు. రామాయణం సినిమా విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ వీఎఫ్ఎక్స్ బృందంతో హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఇస్తూనే... భారతీయ మూలాలను, భావోద్వేగాలను నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భక్తిశ్రద్ధలతో స్క్రీన్‌పై ఆవిష్కరిస్తున్నట్లు నమిత్ ధీమా వ్యక్తం చేశారు. నేటితరం నిర్మాతలు కూడా కచ్చితంగా నమిత్ మల్హోత్రాలా ఆలోచించి...అంతే పట్టుదల, కసిని పెంచుకుని అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీయాలని ఆకాంక్షిద్దాం.
