Begin typing your search above and press return to search.

నాగ్.. ఇలా చుట్టేస్తే కష్టం

అక్కినేని నాగార్జునకు చాన్నాళ్ల తర్వాత ఓ మోస్తరు విజయం దక్కింది. సంక్రాంతికి రిలీజైన ఆయన కొత్త చిత్రం 'నా సామిరంగ' సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 2:45 AM GMT
నాగ్.. ఇలా చుట్టేస్తే కష్టం
X

అక్కినేని నాగార్జునకు చాన్నాళ్ల తర్వాత ఓ మోస్తరు విజయం దక్కింది. సంక్రాంతికి రిలీజైన ఆయన కొత్త చిత్రం 'నా సామిరంగ' సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది. నిర్మాతతో పాటు బయ్యర్లను ఈ చిత్రం సేఫ్ జోన్లోకి తీసుకొచ్చింది. కానీ కంటెంట్ పరంగా చూస్తే 'నా సామిరంగ' అంత ప్రత్యేకమైన సినిమా కాదు. దీనికి రిలీజ్ టైమింగ్, బాక్సాఫీస్ పరిస్థితులు కలిసొచ్చి ఆ మాత్రం విజయం సాధించింది. సంక్రాంతికి ప్రేక్షకులు రూరల్ డ్రామాలను చూసేందుకు ఇష్టపడతారు.

ముఖ్యంగా ఆంధ్రా ప్రాంత మనుషులు, సంస్కృతిని ప్రతిబింబించేలా 'నా సామి రంగ' ఉండడం.. సంక్రాంతి బరిలో నిలిచిన 'గుంటూరు కారం' అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, 'సైంధవ్' డిజాస్టర్ కావడంతో నాగ్ మూవీకి కలిసొచ్చాయి. ఈ రెండు చిత్రాలూ ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఉంటే 'నా సామిరంగ'కు ఇబ్బంది అయ్యేదే. అంతే కాక సంక్రాంతికి కాకుండా వేరే సమయంలో 'నా సామి రంగ' రిలీజై ఉన్నా ఫలితం తేడా కొట్టేసేది. ఎనిమిదేళ్ల కిందట 'సోగ్గాడే చిన్నినాయన'తో ప్రేక్షకులకు మంచి వినోదం పంచిన నాగ్‌కు.. అది కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కానీ దీనికి కొనసాగింపుగా 'బంగార్రాజు' తీస్తే అందులో అంత ఎంటర్టైన్మెంట్ లేకపోయింది.

అయినా సంక్రాంతికి రిలీజైంది కాబట్టి ఓ మోస్తరుగా ఆడింది. 'నా సామిరంగ' పరిస్థితి కూడా అంతే. ఈ రెండు చిత్రాల విషయంలోనూ జరిగింది ఏమంటంటే.. సంక్రాంతికి సూటయ్యేలా రూరల్ బ్యాక్ డ్రాప్ తీసుకుని.. కొన్ని ఆకర్షణలు జోడించి మమ అనిపించేశాడు నాగ్. ఈ సినిమాల్లో బలమైన కంటెంట్ ఉంటే నాగ్ మళ్లీ 'సోగ్గాడే చిన్నినాయన' స్థాయి సక్సెస్ అందుకునేవాడు. ఇలా రెండు సినిమాలు ఓ మోస్తరుగా ఆడేశాయి కానీ.. మళ్లీ ఇలాగే సంక్రాంతి మసాలా దట్టించి మమ అనిపిస్తే కష్టం. వచ్చే సంక్రాంతికి కూడా సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు 'నా సామిరంగ' సక్సెస్ మీట్లో నాగ్ చెప్పాడు. సంక్రాంతికి సూటయ్యే సినిమాలు తీయడం అడ్వాంటేజే కానీ.. ఊరికే చుట్టేస్తే మాత్రం ఇంకోసారి ఇదే రిజల్ట్ రిపీట్ కాకపోవచ్చు. కాబట్టి నాగ్ ఈసారి బలమైన సినిమాతో రావాల్సిందే.