Begin typing your search above and press return to search.

మీకు థోర్- హ‌ల్క్ ఉన్న‌ట్టే మాకు హ‌నుమాన్‌- కుంభ‌క‌ర్ణ ఉన్నారు!

కామిక్ కాన్ ఉత్స‌వాల్లో హాల్ H వద్ద ఉత్సాహంగా త‌న‌ని ప్ర‌శ్నించిన ఒక అభిమానికి నాగ్ అశ్విన్ ఆస‌క్తిక‌ర స‌మాధానాలిచ్చారు

By:  Tupaki Desk   |   26 July 2023 10:31 AM GMT
మీకు థోర్- హ‌ల్క్ ఉన్న‌ట్టే మాకు హ‌నుమాన్‌- కుంభ‌క‌ర్ణ ఉన్నారు!
X

''మీకు అంతరిక్షంలోకి ఎగరగల సూపర్‌మ్యాన్ ఉంటే.. సూర్యుడిని తినగలిగే హనుమంతుడు మాకు ఉన్నాడు! మీకు థోర్ లేదా భవనాన్ని బద్దలు కొట్టగల హల్క్ ఉంటే, పర్వతాన్ని ఎత్తగల హనుమంతుడు లేదా పర్వతం లాంటి కుంభకర్ణుడు మాకు ఉన్నారు''.. కామిక్ కాన్ సినిమా ఉత్స‌వాల్లో త‌న‌కు ఎదురైన ఓ అభిమాని (ఆంగ్లేయుడు- విదేశీ) ప్ర‌శ్న‌కు నాగ్ అశ్విన్ ఇచ్చిన స‌మాధాన‌మిది.

భారతీయ పురాణాల పట్ల ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌కు ఉన్న ఉత్సాహం..దానిని పశ్చిమానికి (వెస్ట్ర‌న్ కి) తీసుకువెళ్ల‌డంపై ఉన్న ఆస‌క్తిని ఇది బ‌హిర్గ‌తం చేసింది. శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో 'కల్కి 2898 AD' టీజ‌ర్ విడుద‌లై ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. విశిష్టమైన సైన్స్ - ఫిక్షన్ సమ్మేళనంతో ఫ‌స్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే గాక యూట్యూబ్ లో అత్యధిక వీక్ష‌ణ‌లు సాధించిన టీజ‌ర్ గా రికార్డుల‌కెక్కింది. క‌ల్కి చిత్రం భార‌త‌దేశం నుంచి ఒక వేవ్ అన్న సంకేతం అందించింది. ప్రతిభావంతుడైన నాగ్ అశ్విన్ ఒక సంచలనాత్మక సినిమాటిక్ అనుభవాన్ని తెలుగు ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌కు అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. భారతీయ పురాణాల శక్తిని ఆవిష్క‌రించే చిత్ర‌మిద‌ని .. ప్రపంచ ప్రేక్షకులపై శాశ్వత ముద్రను వేయ‌డం ఖాయ‌మ‌ని నాగ్ అశ్విన్ ఆ ఇంట‌ర్వ్యూలో హామీ ఇచ్చారు.

కామిక్ కాన్ ఉత్స‌వాల్లో హాల్ H వద్ద ఉత్సాహంగా త‌న‌ని ప్ర‌శ్నించిన ఒక అభిమానికి నాగ్ అశ్విన్ ఆస‌క్తిక‌ర స‌మాధానాలిచ్చారు. భారతీయ దేవతలు సూపర్ హీరోల పట్ల తనకున్న మక్కువను వ్యక్తం చేసిన అత‌డు.. మహాభారతం వంటి ఐకానిక్ పౌరాణిక కథలను .. స్టార్ వార్స్ వంటి టైమ్ లెస్ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ లను చూస్తూ పెరిగానని వెల్లడించారు. రెండు రంగాల కథనాలతో మోహంలో ఉన్నాన‌ని.. రెండు ప్రపంచాలలోని అత్యుత్తమ అంశాలను క‌లిపి అందమైన అల్లిక‌తో ఒక గొప్ప సినిమాని రూపొందించడానికి ప్రేర‌ణ క‌లిగింద‌ని నాగ్ అశ్విన్ తెలిపారు.

'కల్కి 2898 AD' ఫస్ట్ లుక్ ను ప్రపంచవ్యాప్తంగా అభిమానులను విస్మయానికి గురిచేసింది. తరువాతి సంవత్సరం దాని విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూసేంత హైప్ ని తెచ్చింది. 2024వ సంవత్సరం దగ్గర పడుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

భారతీయ పురాణాలను పాశ్చాత్య ప్రేక్షకులకు పరిచయం చేయడం గురించి ఒక అభిమాని అడిగినప్పుడు భారతీయ పురాణాల పట్ల అశ్విన్‌కు ఉన్న ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. ప్రతిస్పందనగా అతడు పురాణాల గురించి అనర్గళంగా మాట్లాడాడు. ''మేము ఈ పురాణాల ఆధారంగా 100 సంవత్సరాల సినిమా అనుభ‌వాల‌ను క‌లిగి ఉన్నాం. గొప్ప సినిమాలు న‌టుల‌ భుజాలపై ఉన్నాయ‌ని నేను అనుకుంటున్నాను. మీరు మీ సూపర్ హీరోలను చాలా ప్రేమిస్తారు. మీకు అంతరిక్షంలోకి ఎగరగల సూపర్‌మ్యాన్ ఉంటే, సూర్యుడిని తినగలిగే హనుమంతుడు మా వద్ద ఉన్నాడు. మీకు థోర్ లేదా భవనాన్ని బద్దలు కొట్టగల హల్క్ ఉంటే, పర్వతాన్ని ఎత్తగల హనుమంతుడు లేదా పర్వతాన్ని ఎత్తే కుంభకర్ణుడు మాకు ఉన్నాడు'' అని ఒక ప్ర‌శ్న‌కు నాగ్ అశ్విన్ జ‌వాబిచ్చారు.

భారతీయ పురాణాలపై ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణ క్రమంగా పెరుగుతోంది. న‌లుమూల‌లా ఉన్న ప్రేక్షకుల నుండి ఆసక్తి పెరుగుతోంది. ఇటీవలి కొన్నేళ్ల‌లో టెలివిజన్ సీరియ‌ళ్లు సహా వివిధ మాధ్యమాలలో రామాయణం -మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాలను వీక్షించాం. భారతీయ పురాణాల గొప్పతనాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేయడంలో 'కల్కి 2898 AD' చిత్రం మరొక ముఖ్యమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.