అప్పట్నుంచే నాగార్జునను ఫాలో అయ్యా
అక్కినేని నాగార్జునకు లవర్ బాయ్, మన్మథుడు అనే ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన్ని రొమాంటిక్ కింగ్ అంటారు.
By: Tupaki Desk | 25 July 2025 10:44 AM ISTఅక్కినేని నాగార్జునకు లవర్ బాయ్, మన్మథుడు అనే ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన్ని రొమాంటిక్ కింగ్ అంటారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన నాగార్జున ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం విలన్ గా మారారు. రజినీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న కూలీ సినిమాలో నాగ్ సైమన్ అనే విలన్ పాత్రలో నటించారు.
నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తున్న కూలీ మూవీ ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. ప్రమోషన్స్ లో పాల్గొంటున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాలేజ్ రోజుల నుంచే నాగార్జునకు ఫ్యాన్ అనే విషయాన్ని లోకేష్ వెల్లడించారు.
రక్షకుడు మూవీ చూశాక నాగార్జున హెయిర్ స్టైల్ ను ఫాలో అయ్యేవాడినని చెప్పిన లోకేష్, తనకు శివ సినిమా అంటే కూడా ఇష్టమని తెలిపారు. కూలీ సినిమా కోసం రజినీని ఒప్పించడం కంటే నాగార్జునను ఒప్పించడమే తనకు కష్టమైందని, హీరోయిజం నుంచి బయటికొచ్చి డిఫరెంట్ గా ట్రై చేయమని ఆయన్ను అడిగానని, కూలీ క్లైమాక్స్ చెప్పాక నాగ్ ఓకే అన్నారని లోకేష్ తెలిపారు.
కూలీలో నాగ్ చేసిన సైమన్ క్యారెక్టర్ కు ఆయన్ని ఒప్పించడానికి నాలుగు నెలల పాటూ నాగార్జున చుట్టూ తిరిగానని కూలీ మూవీ కోసం తమ మధ్య ఏడెనిమిది స్టోరీ సిట్టింగ్స్ జరిగినట్టు లోకేష్ వెల్లడించారు. ముందు విలన్ గా నటించడానికి నాగ్ ఒప్పుకోలేదని, ఎందుకు ఈ క్యారెక్టర్ చేయాలని పదే పదే అడిగేవారని, ఆఖరిగా క్లైమాక్స్ విని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేస్తా అని ఒప్పుకున్నారని లోకేష్ చెప్పారు. కాగా ఇప్పటికే కూలీ సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా, కూలీ నుంచి ట్రైలర్ రిలీజయ్యాక ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే.
