కింగ్ నాగ్ కొత్త దారి ఎంచుకున్నట్టేనా?
అవి ఒకటి 'కుబేర', రెండు 'కూలీ'. 'కుబేర'లో ధనుష్ హీరో. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ సినిమాని శేఖర్ కమ్ముల కోసం అంగీకరించారు.
By: Tupaki Desk | 23 May 2025 5:00 PM ISTకింగ్ నాగార్జున..టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగాలకు నాంది పలికిన పేరిది. కొత్త తరహా సినిమాలు చేయడంలోనూ, కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు నాగార్జున. 'ఊపిరి' కొత్త ప్రయాణం ప్రారంభించిన కింగ్ నాగ్ దాన్ని మధ్యలోనే ఆపేసి మళ్లీ సోలో హీరో సినిమాలు చేశారు. రామ్ గోపాల్ వర్మను నమ్మి చేసిన 'ఆఫీసర్' అట్టర్ ఫ్లాప్ కావడంతో హీరోగా నాగార్జున డౌన్ ఫాల్ మొదలైంది. మళ్లీ నిలబడ్డానికి కల్యాణ్ కృష్ణ చేసిన 'బంగార్రాజు'ను నమ్ముకోవాల్సి వచ్చింది.
ఆ తరువాత చేసిన రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో కింగ్ పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది. ప్రవీణ్ సత్తారుతో చేసిన 'ది ఘోస్ట్', డ్యాన్స్ మాస్టర్ విజయ్ బెన్నీని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ చేసిన మలయాళ రీమేక్ మూవీ 'నా సామిరంగ' కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో మళ్లీ ట్రాక్ మార్చిన నాగార్జున కథను మలుపు తిప్పే కీలక పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మొదలు పెట్టారు. అలా నాగార్జున ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు.
అవి ఒకటి 'కుబేర', రెండు 'కూలీ'. 'కుబేర'లో ధనుష్ హీరో. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ సినిమాని శేఖర్ కమ్ముల కోసం అంగీకరించారు. తనతో ఉన్న సాన్నిహిత్యం, తన ఏకింగ్ స్టైల్ నచ్చడం వల్లే ఈ మూవీలో నటించడానికి ముందుకొచ్చారు నాగ్. ఈ మూవీ జూన్ 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఇందులో నాగ్ కోటీశ్వరుడిగా కనిపించనున్నారు. ఓ బిచ్చగాడికి, ధనవంతుడికి మధ్య సాగే సమరం నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ఇన్ సైడ్ టాక్.
ఈ మూవీ తరువాత నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'కూలీ'. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో. లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్‌ని నాగ్ అంగీకరించడానికి ప్రధాన కారణం. రజనీ, అండ్ క్యారెక్టర్ నచ్చి. ఇందులో నాగ్‌లోకేష్ కనగరాజ్ స్టైలిష్‌గా ప్రజెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అక్కినేని అభిమానుల్ని ఖుషీ చేసింది. భారీ తారగణం నటిస్తున్న ఈ మూవీని ఆగస్టు 14న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల తరువాత నాగార్జున తన 100వ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి తమిళ దర్శకుడు పా. కార్తిక్ దర్శకత్వం వహించనున్నాడని, దీనికి 'కింగ్ 100' అనే టైటిల్‌ని కూడా పరిశీలిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఈ విషయం పక్కన పెడితే కింగ్ తన 100వ సినిమా తరువాత మళ్లీ కొత్తదారిలోనే వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తారా? లేక సోలో హీరో సినిమాలకే ప్రాధాన్యత నిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
