Begin typing your search above and press return to search.

'లెనిన్' వెన‌కే కాదు 'స‌త్యం' వెన‌క చిన మావ‌య్య‌!

అక్కినేని కాంపౌండ్‌లోని హీరోల కెరీర్‌లను సరైన దిశలో నడిపించడంలో.. వారికి మంచి విజయాలను అందించడంలో అక్కినేని నాగార్జున పాత్ర ఎంతో కీలకమైనది.

By:  Sivaji Kontham   |   28 July 2026 9:11 AM IST
లెనిన్ వెన‌కే కాదు స‌త్యం వెన‌క చిన మావ‌య్య‌!
X

అక్కినేని కాంపౌండ్‌లోని హీరోల కెరీర్‌లను సరైన దిశలో నడిపించడంలో.. వారికి మంచి విజయాలను అందించడంలో అక్కినేని నాగార్జున పాత్ర ఎంతో కీలకమైనది. అక్కినేని హీరోలలో ఒకరైన సుమంత్ తన కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో పరాజయాలు, యావరేజ్ సినిమాలతో సతమతమవుతున్న సమయంలో ఆయనకు ఒక మైలురాయి లాంటి విజయం దక్కింది. అదే `సత్యం` సినిమా. సుమంత్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ `సత్యం` డిజైన్ వెనుక నాగార్జున ఉన్నార‌నేది కొంద‌రికే తెలుసు. ఆయ‌న‌ ప్రణాళిక, మద్దతుతోనే సుమంత్ కి మొద‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌క్కింది.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సుమంత్ స్వయంగా మాట్లాడుతూ.. తన కెరీర్‌లోని ల్యాండ్‌మార్క్ చిత్రం `సత్యం`.. అఖిల్ అక్కినేని `లెనిన్` సినిమాల వెనుక నాగార్జున గారి హస్తం ఎంత ఉందో స్పష్టం చేశారు. కెరీర్ ప్రారంభించిన తర్వాత నాలుగేళ్ల పాటు సరైన విజయం లేక వరుసగా యావరేజ్ చిత్రాలతో ముందుకు సాగుతున్న సమయంలో నాగార్జున గారు దగ్గరుండి `సత్యం` ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారని సుమంత్ గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాను పక్కా ప్రణాళికతో తెరకెక్కించడం వల్లే అది అప్పట్లో సంచలన విజయం సాధించి యువ‌న‌టుడు సుమంత్ కెరీర్‌కు బలమైన పునాది వేసింది.

ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో తన వారసుడు అఖిల్ అక్కినేని కోసం నాగార్జున మరోసారి తెరవెనుక ప్రధాన పాత్ర పోషించారు. అఖిల్ హీరోగా కెరీర్ ప్రారంభించి 11 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో... ఆయనకు ఒక బలమైన విజయం అత్యవసరంగా మారింది. ఈ క్రమంలోనే `లెనిన్` సినిమాను అత్యంత జాగ్రత్తగా డిజైన్ చేయడంలో... కథాంశం నుంచి నిర్మాణ విలువల వరకు ప్రతీ విషయంలో నాగార్జున తన మార్గదర్శకత్వాన్ని అందించారని సుమంత్ తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌ల విజయం వెనుక చిన మావయ్య కాంట్రిబ్యూషన్ విపరీతంగా ఉంది. ఆయన ఒక స్ట్రాంగ్ పిల్ల‌ర్ గా నిలిచారు! అని సుమంత్ ఎంతో భావోద్వేగంగా చెప్పారు. నాగార్జున బ్యాకింగ్‌తోనే అప్పట్లో సత్యం, ఇప్పుడు లెనిన్ చిత్రాలు విజ‌యాలుగా మారాయ‌ని.. ఇలా కుటుంబ సభ్యుల సినిమాల వెనుక కింగ్ నిలబడి విజయ తీరాలకు చేర్చడం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

మొత్తానికి నాగార్జున కేవలం హీరోగా మాత్రమే కాకుండా... అక్కినేని హీరోల కెరీర్‌లను సరైన సమయంలో డిజైన్ చేసే గైడ్‌గా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో సుమంత్‌కు `సత్యం`తో అందించిన ఊరట... విజయం ఎలాంటిదో.. ఇప్పుడు అఖిల్‌కు `లెనిన్` రూపంలో లభించిన విజయం కూడా అంతే ప్రత్యేకమైనదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు సినిమాల విజయాల వెనుక నాగార్జున పక్కా విజన్, నిరంతర శ్రమ ఉన్నాయని స్పష్టమవుతోంది.