నేషనల్ క్రష్ కాదు, నాగ్ క్రష్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కలయికలో వచ్చిన కుబేర సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తుంది.
By: Tupaki Desk | 23 Jun 2025 7:15 AMశేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కలయికలో వచ్చిన కుబేర సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం కుబేర విజయోత్సవ సభను హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరవగా, చిత్ర యూనిట్ మొత్తం ఇందులో పాల్గొన్నారు.
ఈ సినిమాలో నాగార్జున సీబీఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో పోషించి తన అద్భుత నటనతో ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. తన నటనతో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకున్న నాగ్, చిరంజీవిని చిత్ర పరిశ్రమ మొత్తం ప్రేమిస్తుందని, అన్ని భాషల సినిమాలు, నటీనటులకు ఆయన మద్దతిస్తూ, తనదైన సపోర్ట్ ఇస్తారని అన్నాడు.
కుబేర సినిమా పూర్తిగా శేఖర్ కమ్ముల సినిమానే అని మరోసారి నాగ్ ఈ సందర్భంగా అన్నాడు. హ్యూమన్ వాల్యూస్ తో కలగలిపిన థ్రిల్లర్ ను తీయడం చాలా కష్టమైన పని అని, అయినా శేఖర్ కుబేరను ఎంతో గొప్పగా మలిచాడని ప్రశంసించాడు. తనకు దీపక్ లాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు చెప్పిన నాగ్, మంచి అవుట్‌పుట్ వచ్చేలా చేసిన సాంకేతిక బృందాన్ని కూడా అభినందించాడు.
బిచ్చగాడిగా ధనుష్ నటన గురించి చెప్పడానికి తన దగ్గర మాటలు కూడా లేవని, ధనుష్ ఇప్పటికే నాలుగు నేషనల్ అవార్డులు గెలుచుకున్నాడని, అతని యాక్టింగ్ టాలెంట్ గురించి చెప్పడానికి ఇంకేమీ లేదని నాగ్ అన్నాడు. ఇదే సందర్భంగా రష్మిక గురించి మాట్లాడుతూ, ఆమెను అతిలోక సుందరి శ్రీదేవితో పోల్చాడు నాగ్. రష్మికను చూస్తుంటే చాలా ఫ్రేమ్‌ల్లో క్షణ క్షణం సినిమాలోని శ్రీదేవి గుర్తుకు వచ్చిందని అన్నాడు. నాగార్జున వ్యాఖ్యలతో రష్మిక ఉలిక్కి పడినప్పటికీ అతను ఆమెను పొగడటం మాత్రం ఆపలేదు. రష్మికను అందరూ నేషనల్ క్రష్ అంటున్నారని, ఆమె నేషనల్ క్రష్ మాత్రమే కాదని, నాగ్ క్రష్ అని అనడంతో రష్మిక సంతోషంతో పొంగిపోయింది. అదే ఈవెంట్ లో చిరంజీవి రష్మికను గురించి ప్రస్తావిస్తూ నేషనల్ క్రష్ అయిన రష్మిక క్రమంగా ఇంటర్నేషనల్ క్రష్ గా మారిపోయిందని అన్నారు.