నాగార్జున తెలుగు సినిమాలో విలన్‌గా?
కెరీర్ ప్రారంభం నుంచి కింగ్ నాగార్జున పంథాయే వేరు. ఆయన ప్రతిభావంతులైన కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేసారు.
By: Tupaki Desk | 18 Jun 2025 8:15 AM ISTకెరీర్ ప్రారంభం నుంచి కింగ్ నాగార్జున పంథాయే వేరు. ఆయన ప్రతిభావంతులైన కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేసారు. ట్యాలెంటెడ్ ఆర్జీవీ.. నాగార్జున డిస్కవరీనే. చాలా మంది కొత్త వారికి నాగ్ అవకాశాలు కల్పించారు. అంతేకాదు పాత్రల ఎంపికలోను ఆయన ఎప్పుడూ వైవిధ్యంగా ఆలోచిస్తారు. శివ, గీతాంజలి లాంటి కల్ట్ సినిమాల్లో ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించారు.
ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం `కుబేర`లో మరో ఆసక్తికర సహాయక పాత్రలో కనిపించనున్నారు. శేఖర్ కమ్ముల వినిపించిన స్క్రిప్టు , అందులో తన పాత్ర బాగా నచ్చాయి. ఈ కథలో ఆత్మ ఉందని నాగ్ భావించినట్టు చెప్పారు. అందుకే ధనుష్ - రష్మిక నాయకానాయికలుగా రూపొందించిన ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించానని తెలిపారు. ఇది రొటీన్ పాత్ర కాదు. రొటీన్ కి భిన్నమైనదని నాగార్జున చెబుతున్నారు. ఇక హీరోగానే నటించాలనే రూల్ తనకేమీ లేదని, కెరీర్ ప్రారంభం నుంచి తనకు అలాంటి అభద్రత లేదని అన్నారు. శివ -గీతాంజలి తర్వాత, నేను అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన హిందీలో ఖుదా గవా (1992)కి సంతకం చేసాను. అజయ్ దేవ్‌గన్ నటించిన జఖ్మ్ (1998)లో కూడా సహాయక పాత్ర చేసాను. కొన్ని తెలుగు సినిమాల్లోను చేసాను. పాత్ర వెయిట్ ఎంత అనేదే ముఖ్యం.
అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర ఇటీవలి కాలంలో నాగార్జున కెరీర్ కు కీలక మలుపు. ఇందులో పాత్ర చిన్నదే అయినా ప్రభావం చూపించే పాత్రలో నటించానని నాగ్ అన్నారు. నంది అస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా కనిపిస్తాను. చిన్న పాత్ర అయినా బలమైన పాత్రలో నటించాను అని నాగ్ అన్నారు. బ్రహ్మాస్త్ర తనను గందరగోళం నుంచి బయటపడేసిన సినిమా అని కూడా తెలిపారు. ఇక రజనీకాంత్ కూలీలో లోకేష్ కనగరాజ్ విలన్ పాత్రను ఆఫర్ చేసాడని కూడా వెల్లడించారు. మీ కోసం ఒక విలన్ పాత్ర ఉంది.. విన్న తర్వాత మీరు సౌకర్యంగా లేకుంటే కాఫీ తాగి వదిలేద్దామని లోకేష్ అన్నాడు. కాఫీ అవసరం లేదు.. స్క్రిప్టు చెప్పండి.. నచ్చితే నేను రెడీ.. అన్నాను. పాత్ర శక్తివంతమైనది అయితే విలన్ గా నటించడానికి అభ్యంతరం లేదని చెప్పాను.. అన్నారు. నాగ్ మాటల్లో నిజాయితీ స్పష్ఠత ఆకట్టుకుంటున్నాయి. కుబేర ఈనెల 20 న విడుదల కానుంది. ఈ చిత్రంలో నాగార్జున నటన ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి అభిమానులకు ఉంది. ఒక తెలుగు స్ట్రెయిట్ సినిమాలో విలన్ గా నటించే అవకాశం వచ్చినా నాగ్ నటిస్తారా? అన్నది వేచి చూడాలి.
