ఆ క్రెడిట్ అంతా శేఖర్‌దే!
కుబేర ట్రైలర్ చూశాక అందరూ ఈ సినిమా ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే కథ అని అనుకుంటున్నారు.
By: Tupaki Desk | 19 Jun 2025 4:46 PM ISTశేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సోషల్ డ్రామా కుబేరలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ 20న కుబేర రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన నాగార్జున సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. తాను గతంలో చేసిన పలు మల్టీస్టారర్ సినిమాలకు కుబేర సినిమా భిన్నంగా ఉంటుందని నాగ్ అభిప్రాయ పడ్డాడు.
మల్టీస్టారర్ సినిమాలు చేయడం ఇష్టమని చెప్తున్న నాగార్జున, మంచి కథలను ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లడానికి అందరు స్టార్లు కలవడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నాడు. ఎప్పట్నుంచో శేఖర్ కమ్ములతో కలిసి వర్క్ చేయాలనుకుంటే ఇన్నాళ్లకు ఆ ఆశ తీరిందని, శేఖర్ కమ్ముల ఈ సినిమాను తన ఓన్ స్టైల్ లో కమర్షియల్ గా మలిచాడని, శేఖర్ సినిమాలంటే అందులో మంచి మ్యూజిక్ ఉంటుందనే పేరుందని, మరీ ముఖ్యంగా లవ్ స్టోరీలోని సాంగ్స్ తనకెంతో ఇష్టమని నాగ్ తెలిపాడు.
కుబేర ట్రైలర్ చూశాక అందరూ ఈ సినిమా ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే కథ అని అనుకుంటున్నారు. కానీ కుబేర సినిమా ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ కాదని, ఈ కథ మూడు సామాజిక తరగతుల మధ్య జరిగే ఘర్షణ అని, అందులో ధనవంతులు, మధ్యతరగతి వాళ్లు, పేదలు గురించి శేఖర్ చాలా గొప్పగా చూపించాడని, తన క్యారెక్టర్ మిడిల్ క్లాస్ కు చెందిన సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు నాగ్ వెల్లడించాడు. తప్పొప్పులను ఎంచుకోవడానికి సినిమాలో తన పాత్ర చాలా కష్టపడుతుందని ఆయన అన్నాడు.
కుబేర సినిమాలో ఆడియన్స్ తన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ కీలక మార్పుని గమనిస్తారని, అదంతా శేఖర్ కమ్ముల క్రెడిటే అని చెప్పాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కగా, తమిళంలో కూడా తన పాత్రకు నాగార్జునే డబ్బింగ్ చెప్పుకున్నట్టు తెలిపాడు. ధనుష్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడని, అతనితో కలిసి వర్క్ చేయడం చాలా బాగా ఎంజాయ్ చేశానని నాగ్ చెప్పాడు.
సినిమాలో రష్మిక క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని, కుబేరలో నువ్వే స్టార్ అని రష్మికకు ఆల్రెడీ చెప్పానన్నాడు. కుబేర కథ, అతని పాత్ర రియల్ లైఫ్ సంఘటనల నుంచి స్పూర్తి పొందినవని, నిజ జీవితంలోని ఓ వ్యక్తిని చూసే తన క్యారెక్టర్ ను కూడా శేఖర్ రాశాడని, కుబేరలో కథ కంటే ప్రజలు ఒకరినొకరు ఎలా దోపిడీ చేసుకుంటారనే దాని గురించే ఎక్కువ ఉంటుందని నాగార్జున తెలిపాడు. హీరోగా తన 100వ ప్రాజెక్టును త్వరలోనే అనౌన్స్ చేస్తానని నాగ్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు. బిలీయనీర్ వర్సెస్ బెగ్గర్ ఆధారంగా రూపొందిన కుబేర పై అందరికీ భారీ అంచనాలున్నాయి. మరి ఈ అంచనాలను కుబేర ఏ మేర అందుకుంటుందో చూడాలి.
