Begin typing your search above and press return to search.

నాగార్జున.. ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జున చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరూ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 1:40 AM IST
నాగార్జున.. ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే
X

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జున చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరూ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా ఎప్పటికప్పుడు భిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుని ఆయన తన రూటే వేరని చాటుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడంతా యువ కథానాయకులదే హవా. ప్రేక్షకుల దృష్టి వారి మీదే ఉంటోంది. కానీ ఇలాంటి టైంలో కూడా నాగ్ తన మార్కు వేస్తూనే ఉన్నారు. సోలో హీరోగా కొన్ని ఎదురు దెబ్బలు తినడంతో మార్కెట్ డౌన్ అయిన టైంలో ఆయన కొంచెం గ్యాప్ తీసుకుని ప్రత్యేక పాత్రలు చేయడానికి రెడీ అయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ లీడ్ రోల్ చేసిన ‘కుబేర’లో ఆయన ఓ కీలక పాత్ర చేశారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘కూలీ’లో ఏకంగా విలన్ పాత్ర చేశారు. ఐతే ‘కుబేర’ సినిమా మీద విడుదల ముంగిట పెద్దగా అంచనాలు లేకపోయాయి. ఆయన పాత్ర పట్ల కూడా అభిమానులు అంతగా ఆసక్తి చూపించలేదు.

కానీ నిన్న రిలీజైన ‘కుబేర’ చూసిన వాళ్లంతా నాగ్ మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘స్టార్’ ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి.. కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్న మాజీ సీబీఐ అధికారి పాత్రలో నాగ్ ఒదిగిపోయిన తీరుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవసరమైతే నాగ్ సటిల్‌గానూ నటించి మెప్పించగలరని చాటి చెప్పారు. ఇందులో చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అది చేస్తూ సంఘర్షణకు గురయ్యే పాత్రలో నాగ్ గొప్పగా నటించాడు. ఈ పాత్రను ముగించిన తీరు అభిమానులకు షాకింగ్‌గానే ఉంటుంది. కానీ ఆ పాత్రను అలా ముగించడమే కరెక్ట్ అని ప్రేక్షకులు కూడా ఒప్పుకుంటారు. ఒక పెద్ద స్టార్ హీరో హీరోయిజం లేని, నెగెటివ్ షేడ్స్ కూడా ఉన్న ఇలాంటి పాత్ర ఒప్పుకోవడం చిన్న విషయం కాదు. తాను ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే అని నాగ్ మరోసారి ‘కుబేర’తో రుజువు చేశారు. రేప్పొద్దున ‘కూలీ’తో ఆయన మరింత సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.