నాగ్ కామెంట్‌పై తమిళ ఫ్యాన్స్ గోల
తెలుగులో ఇమేజ్ గురించి ఆలోచించకుండా.. భేషజం లేకుండా ఎలాంటి పాత్రనైనా చేసే స్టార్ హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు.
By: Tupaki Desk | 22 Jun 2025 9:41 AM ISTతెలుగులో ఇమేజ్ గురించి ఆలోచించకుండా.. భేషజం లేకుండా ఎలాంటి పాత్రనైనా చేసే స్టార్ హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. హీరోగా ఆయన చేసిన ప్రయోగాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాగే వేరే హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేయడానికి కూడా ఆయన ఎప్పుడూ వెనుకాడరు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆయన ఇలాంటి ప్రత్యేక పాత్రలు చేశారు. తాజాగా కుబేర సినిమాలో దీపక్ పాత్రతో ఆయన మెప్పించారు. తమిళ స్టార్ ధనుష్ ఇందులో లీడ్ రోల్ చేస్తే.. నాగ్ హీరోతో దాదాపు సమానంగా ఉన్న క్యారెక్టర్ చేశారు. ఎవరి స్థాయిల వాళ్లు గొప్పగా నటించారు. సినిమాకు కూడా మంచి టాక్ రావడంతో అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఐతే సక్సెస్ ప్రెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ చేసిన ఒక కామెంట్ తమిళ ఫ్యాన్సుకు ఆగ్రహం తెప్పించేసింది. నాగ్‌ను తిట్టిపోస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
కుబేర కథ చెప్పినపుడు ఇందులో తానే హీరో అని ఫీలయ్యానని.. ఈ కథలో తన పాత్రే అత్యంత కీలకంగా అనిపించిందని.. కథ తన పాత్రతోనే మొదలై.. దాని వల్లే మలుపు తిరుగుతుందని నాగ్ వ్యాఖ్యానించడమే తమిళ జనాల ఆగ్రహానికి కారణం. ఈ సినిమా విడుదలకు ముందు ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగ్ మాట్లాడుతూ. ఈ సినిమాలో తాను కానీ, ధనుష్ కానీ హీరోలం కాదని.. మాయాబజార్‌కు దర్శకుడు కేవీ రెడ్డి ఎలా హీరోనో.. ఈ చిత్రానికి కూడా శేఖర్ కమ్ములనే హీరో అని నాగ్ వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అప్పుడు అలా మాట్లాడిన నాగ్.. సినిమా పెద్ద హిట్ అవుతుండే సరికి క్రెడిట్ తనే తీసుకోవాలని చూస్తున్నాడని.. హీరోగా తననే ప్రకటించుకున్నాడని.. ఇది ఏం న్యాయమని ఆయన్ని ప్రశ్నిస్తున్నారు ధనుష్ ఫ్యాన్స్.
ఐతే నాగ్ మాటల్ని వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారన్నది స్పష్టం. తాను సినిమా ఒప్పుకునేటపుడు తన పాత్రకున్న ప్రాధాన్యం చూశానని.. అందులో తనే హీరో అనిపించిందని మాత్రమే అన్నాడు నాగ్. ఇప్పుడు కొత్తగా క్రెడిట్ తీసుకోవడానికి ఆయన ప్రయత్నించాడన్నది నిజంకాదు. అసలు విషయం ఏంటంటే.. ఇదే ప్రెస్ మీట్లో నాగ్ మరోసారి మాయాబజార్-కేవీరెడ్డి పోలిక తీసుకొచ్చాడు. ఇంతకుముందు అన్నట్లే ఈ సినిమాకు శేఖర్ కమ్ములనే హీరో అన్నాడు. అది వదిలేసి వేరే కామెంట్‌ను బూచిగా చూపించి ఆయన్ని ట్రోల్ చేయడం అన్యాయం.
