'హిట్-3'తో కొట్టు.. నాగ్‌తో ఛాన్స్ పట్టు
నాగ్ మామూలుగా ట్రాక్ రికార్డు చూసి అవకాశం ఇచ్చే టైపు కాదు. కొత్త దర్శకుడైనా, ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ అయినా.. కథ నచ్చితే ఓకే చేసేస్తుంటారు.
By: Tupaki Desk | 30 April 2025 4:19 PMమంచి ట్రాక్ రికార్డున్న దర్శకుడి కొత్త చిత్రం రిలీజ్ కాబోతుండగానే.. మరో చిత్రానికి సంబంధించి కథా చర్చలు జరగడం కామన్. ఐతే ఒక స్టార్ హీరో ఆ సినిమాను ఓకే చేసే ముందు.. ఆ దర్శకుడి కొత్త చిత్రం ఫలితం చూద్దామని వెయిట్ చేయడమూ మామూలే. అక్కినేని నాగార్జున్ కూడా ఇలాగే వెయిటింగ్‌లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గురువారం కార్మిక దినోత్సవం కానుకగా నాని కొత్త చిత్రం ‘హిట్-3’ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. హిట్ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు హిట్లు కొట్టిన శైలేష్ కొలను ఈ చిత్రాన్ని రూపొందించాడు.
అతను ఇప్పటికే నాగార్జునకు ఒక ఐడియా చెప్పడం, ఆయన ఇంప్రెస్ అవడం జరిగిందట. ఐతే ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ‘హిట్-3’ అంచనాలను అందుకుని హిట్ అయితే నాగ్.. ఈ సినిమా చేయడం లాంఛనమే.
నాగ్ మామూలుగా ట్రాక్ రికార్డు చూసి అవకాశం ఇచ్చే టైపు కాదు. కొత్త దర్శకుడైనా, ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ అయినా.. కథ నచ్చితే ఓకే చేసేస్తుంటారు. ఐతే ఇప్పుడు నాగ్ ట్రాక్ రికార్డే బాగా లేదు. ఆయన పెద్ద హిట్ కొట్టి చాలా ఏళ్లయిపోయింది. బంగార్రాజు, నా సామి రంగ లాంటి యావరేజ్ చిత్రాలతో సరిపెట్టారు. ‘నా సామి రంగ’ తర్వాత ఆయన సోలో హీరోగా కొత్త సినిమాకు ఓకే చేయలేదు. ఏడాది దాటినా సైలెంట్‌గా ఉన్నారు.
తమిళ దర్శకులు నవీన్, మోహన్ రాజాలతో చర్చలు జరిగాయి.. ఏ సినిమా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆయన దృష్టిలో శైలేషే ఉన్నట్లు తెలుస్తోంది. హిట్ ఫ్రాంఛైజీతో శైలేష్ బాగానే టాలెంట్ చూపించాడు కానీ.. వెంకటేష్‌తో తీసిన ‘సైంధవ్’ మాత్రం తేడా కొట్టేసింది. దీంతో మళ్లీ తనేంటో రుజువు చేయాల్సి ఉంది. ‘హిట్-3’తో మళ్లీ తన మార్కు చూపిస్తే నాగ్‌తో సినిమా కన్ఫమ్ అయినట్లే.