నాగార్జున 'కూలీ'తో ట్రెండ్ సెట్ చేస్తాడా?
ఓ దశలో సెల్యూలాయిడ్ సైంటిస్ట్ అనిపించుకున్నారు. అయితే గత రెండు.. మూడేళ్లుగా నాగార్జున వరుస ఫ్లాపులతో ఏం చేయాలో తెలియని స్థితికి వెళ్లిపోయారు.
By: Tupaki Desk | 16 July 2025 7:00 PM ISTటాలీవుడ్‌లో కింగ్ నాగార్జున శైలి ప్రత్యేకం. న్యూ టాలెంట్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ముందుండి ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్లని పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. కొత్త టాలెంట్‌ని ఆయన ఎంకరేజ్ చేసి ఉండకపోతే ట్రెండ్ సెట్టర్ లాంటి `శివ` వెలుగు చూసేది కాదు. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యేవాడు కాదు. ఇలా ఎంత మంది డైరెక్టర్లని, టెక్నీషియన్‌లని నాగ్ ఇండస్ట్రీకి పరిచయం చేసి ఎన్నో కొత్త ప్రయోగాలు చేశారు.
ఓ దశలో సెల్యూలాయిడ్ సైంటిస్ట్ అనిపించుకున్నారు. అయితే గత రెండు.. మూడేళ్లుగా నాగార్జున వరుస ఫ్లాపులతో ఏం చేయాలో తెలియని స్థితికి వెళ్లిపోయారు. సమకాలీన హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ హిట్‌లు, బ్లాక్ బస్టర్లు ఇస్తుంటే నాగ్ మాత్రం ఫ్లాపులతో షాకులిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన తన పంథా మార్చుకుని కేవలం హీరో క్యారెక్టర్లు మాత్రమే చేస్తానని భీష్మించుకు కూర్చోకుండా కథకు కీలకంగా ఉండే పాత్రలకు సై అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఈ క్రమంలో ఆయన నటించిన 'కుబేర' మంచి హిట్ అనిపించుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టి ఔరా అనిపించింది. ఈ మూవీతో పాటు నాగార్జున మరో క్రేజీ సినిమాలోనూ కీలక పాత్రలో నటించారు. అదే సూపర్ స్టార్ రజనీకాంత్ `కూలీ`. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఇందులో కింగ్ సిమోన్ అనే పవర్ ఫుల్ డాన్‌గా కనిపించి ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ని ఆశ్చర్యపరచబోతున్నారు.
ఇంత వరకు ఎన్నడూ చేయని క్యారెక్టర్‌లో కింగ్ నాగ్ కనిపించబోతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ వెల్లడించాడు. ఎనిమిది సార్లు ఈ క్యారెక్టర్ కోసం నాగార్జునకు నరేషన్ ఇచ్చానని, ఆ తరువాతే ఆయన ఓకే చేశారని తెలిపాడు. నాగార్జున కోసం నాలుగు నెలలు ఎదురు చూశామని, తనతో పాటు రజనీకాంత్ కూడా ఆయన కోసం ఎదురు చూశారని చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాగార్జున తన 40ఏళ్ల కెరీర్‌లో వాడని పదాలని వాడారని, ఈ క్యారెక్టర్‌లో ఆయనని ప్రేక్షకులు అంగీకరిస్తారా? అని నాగార్జునకు కొంత అనుమానంగా ఉందని చెప్పాడు.
కింగ్ నాగ్‌ని ఈ మూవీలో లోకేష్ కనగరాజ్ సరికొత్త తరహాలో స్టైలిష్‌గా ప్రజెంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. తనదైన మార్కు నటనతో నాగ్ ఖచ్చితంగా అందరిని డామినేట్ చేస్తాడని ఫ్యాన్స్‌తో పాటు టీమ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే నాగార్జున `కూలీ`తో ట్రెండ్ సెట్ చేస్తాడనిడంలో ఎలాంటి సందేహం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
