కుబేర అప్‌డేట్.. కింగ్ ముగించాడు
ధనుష్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమాను ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 7 Jun 2025 10:00 AMధనుష్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమాను ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ధనుష్ డబ్బింగ్ పనులు పూర్తి చేశాడు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ధనుష్ ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఇటీవల రష్మిక మందన్న సైతం కుబేర సినిమా కోసం డబ్బింగ్ చెప్పిందనే వార్తలు వచ్చాయి. తాజాగా నాగార్జున సైతం ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశాడు. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషన్ వీడియోల్లో నాగార్జున లుక్ ఆకట్టుకుంది. బాగా డబ్బున్న వ్యక్తి పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో నాగార్జున, ధనుష్ పాత్రల మధ్య ఉండే సంబంధం ఏమై ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధనుష్ పాత్ర అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా శేఖర్ కమ్ముల విభిన్నమైన కమర్షియల్ కథతో ఈ సినిమాను రూపొందించినట్లుగా అనిపించింది. ఈ సినిమాలో రష్మిక పాత్ర విషయంలోనూ ఆసక్తికర చర్చ జరిగింది. మొత్తానికి సినిమాలోని అన్ని పాత్రలు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి.
సినిమాను చాలా కాలంగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేయాలి అనుకున్న సినిమాను వాయిదా వేశారు. అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వచ్చిన కుబేర సినిమాను జూన్ 20న విడుదల చేయబోతున్న నేపథ్యంలో ధనుష్ ఫ్యాన్స్‌తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. నాగార్జున సోలో హీరోగా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్‌ను సాధించడం లేదు. ఈ నేపథ్యంలో నాగార్జున నుంచి రాబోతున్న ఈ సినిమా అయినా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందా అని అక్కినేని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. ఆయన ఈ సినిమాలో సెకండ్ హీరో పాత్రలో కనిపించబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది.
నిన్న మొన్నటి వరకు నాగార్జున తన కొడుకు అఖిల్ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. ఎట్టకేలకు ఆయన ఆ పనుల నుంచి కాస్త రిలాక్స్ అయ్యారు. అఖిల్ పెళ్లి అయిన వెంటనే కుబేర సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో వెంటనే డబ్బింగ్ పూర్తి చేశారు. నాగార్జున డబ్బింగ్ చెబుతూ సినిమాను చాలా ఎంజాయ్ చేశారని దర్శకుడు శేఖర్ కమ్ముల సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం అందుతోంది.
శేఖర్ కమ్ముల సినిమాలంటే ఇష్టపడే వారు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు ఈ సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా ఉన్నారు. తమిళ్, తెలుగులో ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయబోతున్నారు. సోలో రిలీజ్ దక్కించుకున్న ఈ సినిమాకు కలిసి వచ్చే విషయం ఏంటంటే అక్కడ, ఇక్కడ ఈ సినిమాకు మంచి బిజినెస్ అయ్యింది, ఎక్కువ థియేటర్‌లలో విడుదల కాబోతుంది.