బిగ్‌బాస్9.. ఈసారి చదరంగం కాదు, రణరంగమే
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి ఫ్యాన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
By: Tupaki Desk | 27 Jun 2025 4:02 PM ISTతెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి ఫ్యాన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 9వ సీజన్ కు సిద్ధమైంది. దానికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ గురువారం అఫీషియల్ గా రిలీజ్ చేయగా, ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈసారి హోస్ట్ మారుతున్నారని జరిగిన ప్రచారానికి చెక్ పెడుతూ కింగ్ నాగార్జున ఎంతో స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ప్రోమో చూస్తుంటే ఈసారి సీజన్ సరికొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది. కొత్త లోగో తో పాటూ సరికొత్త కాన్సెప్ట్, అన్నింటికీ మించి నాగార్జున ఎనర్జీ ఫ్యాన్స్ కు మరింత కిక్కిచ్చింది. ఆటలో అలుపు వచ్చినంత ఈజీగా గెలుపు రాదని, ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం కూడా సృష్టించాలని నాగ్ చెప్పి ఈ సీజన్ యొక్క థీమ్ ను చెప్పకనే చెప్పారు నాగ్.
ఇకపై ఈ గేమ్ చదరంగం కాదని, రణరంగమని చెప్తూ బిగ్ బాస్ షో లో ఈసారి రూల్స్ మారుతున్నాయని, టాస్క్ లు చాలా ఛాలెంజింగ్ గా ఉండనున్నాయని క్లూ ఇచ్చారు నాగార్జున. టీజర్ లో కాన్సెప్ట్ ను పెద్దగా రివీల్ చేయలేదు కానీ ఈసారి సీజన్ మాత్రం కొత్తగా ఉంటుందని అర్థమయ్యేలా చేశారు. నాగార్జున కేవలం హోస్ట్ గానే కాకుండా షో లో చెప్పినట్టు బిగ్ బాస్ ఇంటిని తన ఇంటిలానే చూసుకునే బాధ్యతను మరోసారి తీసుకున్నారు.
ఎప్పటిలానే ఈ సారి కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషయంలో చాలా ఉత్కంఠ నెలకొనగా, ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్‌బాస్9 కంటెస్టెంట్లు వీళ్లే అని పలువురు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. సెప్టెంబరు నుంచి ఈ సీజన్ ను మొదలుపెట్టాలని షో నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై బిగ్‌బాస్ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, ప్రోమో మాత్రం ఓ విషయానికి స్పష్టం చేస్తుంది. బిగ్ బాస్ సీజన్9 పాత సీజన్లలా కాకుండా సరికొత్తగా ఉండనుందని అర్థమవుతుంది.
