అఖిల్‌ను నా కెరీర్‌తో పోల్చొద్దు.. నాగార్జున స్ట్రాంగ్ మెసేజ్!
రిలీజ్‌కు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో హీరో నాగార్జున చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
By: Sravani Lakshmi Srungarapu | 8 July 2026 6:30 PM ISTఅఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన లెనిన్ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో హీరో నాగార్జున చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అఖిల్ కెరీర్, సినిమా క్వాలిటీ, రిలీజ్ వాయిదా వెనుక కారణాల వరకు పలు అంశాలపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు.
అఖిల్ గురించి మాట్లాడిన నాగార్జున.. అంచనాలు ఎక్కువగా ఉండటమే పెద్ద సమస్యని, తన కెరీర్ స్టార్టింగ్ లో తనను తన తండ్రి నాగేశ్వరరావు గారితో పోల్చేవారని, ఆయనలా లేడని అనేవారని, ఇప్పుడదే పరిస్థితి అఖిల్‌కు వచ్చిందని, తన కెరీర్‌తో అఖిల్ కెరీర్‌ను పోల్చడం సరైంది కాదని అన్నారు. లెనిన్ విషయంలో మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నానని స్పష్టం చేశారు. తాను చాలా అరుదుగానే సినిమా గురించి ముందే ఇలా చెబుతుంటానని, లెనిన్ చూసిన తర్వాతే ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందని, మనోడు వస్తున్నాడు.. కొడుతున్నాడని చెప్తూ, ఈ సినిమా అఖిల్ కెరీర్ లో మంచి మూవీ గా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో అఖిల్ పూర్తిగా కొత్తగా కనిపిస్తాడని నాగార్జున చెప్పారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, అఖిల్ డైలాగ్ డైలెక్ట్, రూరల్ బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత తనకు కొత్త అఖిల్ కనిపించాడన్నారు. తాను చేసిన తొలి రూరల్ మూవీ జానకి రాముడు తన కెరీర్‌పై ఎంత ప్రభావం చూపిందో గుర్తు చేస్తూ, లెనిన్ కూడా అఖిల్‌ను మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాణంలో తాను ఎంతవరకు జోక్యం చేసుకున్నారనే ప్రశ్నకు నాగార్జున ఆసక్తికరంగా స్పందించారు. కథ విన్నప్పుడు అఖిల్ ఈ పాత్రకు సరిపోతాడా అనే డౌట్ వచ్చినా, సెట్స్‌కి వెళ్లి అఖిల్ ను చూసిన తర్వాత ఆ డౌట్ పూర్తిగా తొలగిపోయిందని, అయితే తాను కావాలని ప్రతి విషయంలో జోక్యం చేసుకోలేదని, టీమ్ పిలిచి అడిగినప్పుడు మాత్రమే తన సూచనలు ఇచ్చానని స్పష్టం చేశారు.
అఖిల్ కోసం తాను ఎంతగా ఆలోచించానో కూడా నాగార్జున వెల్లడించారు. ఇండస్ట్రీలో 'లెనిన్' కథను మొదటి నుంచే బలంగా నమ్మిన వ్యక్తిగా తన పేరు వినిపిస్తోందని ప్రస్తావించగా, ఏ తండ్రికైనా తన బిడ్డ బాగా చేయడం కంటే పెద్ద ఆనందం ఉండదని, తనక్కూడా అదే ఫీలింగ్ అని, తాను చివరిసారిగా ఇంతగా ఇన్వాల్వ్ అయింది మనం సినిమాకే అని, అప్పుడు అది తన తండ్రి కోసం చేశానని, ఇప్పుడు తన బిడ్డ కోసం ఒక తండ్రిగా చేయాల్సింది చేశానని, లెనిన్ కూడా మనం లాగా క్లాసిక్ అవుతుందా లేదా అనేది మాత్రం తన చేతుల్లో లేదని, తాను చేయాల్సినంత చేశానని, ఇక దాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారని నాగార్జున అన్నారు.
లెనిన్ రిలీజ్ పోస్ట్ పోన్ అవడంపై కూడా నాగ్ క్లారిటీ ఇచ్చారు. సినిమా మరింత మెరుగ్గా ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతోనే రిలీజ్‌ను వాయిదా వేసినట్లు చెప్పారు. మనకు నచ్చని సినిమాను ప్రేక్షకుల ముందుకు పెట్టకూడదు. జూన్ 26కే రిలీజ్ చేయొచ్చు. కానీ మరో రెండు వారాలు టైమ్ ఇస్తే సినిమాను ఇంకా బాగా ప్రెజెంట్ చేయగలమని టెక్నీషియన్లు తనను కోరారని, అందుకే దానికి ఒప్పుకున్నానని, దాని వల్ల ఎలాంటి బిజినెస్ లెక్కలు మారలేదని, పైగా సినిమా మరింత మెరుగ్గా వచ్చిందని నాగ్ తెలిపారు. అదే సమయంలో తన 100వ సినిమా కింగ్100 గురించి కూడా చిన్న హింట్ ఇచ్చిన నాగార్జున.. ప్రస్తుతం మొత్తం ఫోకస్ లెనిన్ పైనే ఉందని, సినిమా రిలీజ్ తర్వాత త్వరలోనే కింగ్100పై అధికారికంగా మాట్లాడతానని వెల్లడించారు. ఈ కామెంట్స్ అఖిల్ ఫ్యాన్స్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్‌లోనూ లెనిన్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
