39 ఏళ్ల నాగ్ జర్నీ.. యంగ్ హీరోలకు ఎంతో స్పూర్తిదాయకం
అయితే నాగార్జున హీరోగా మొదట సక్సెస్ అందుకున్న సినిమా ఆఖరి పోరాటం.
By: Tupaki Desk | 23 May 2025 6:07 PM ISTతెలుగు ప్రేక్షకులకు అక్కినేని నాగార్జున నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ సినిమా హీరోకి రీమేక్ గా వచ్చిన విక్రమ్ సినిమాతో 1986 మే 23న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగార్జున. ఆ తర్వాత మజ్ను సినిమాలో విషాద పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకున్న నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావు తో కలిసి మొదటిసారిగా కలెక్టర్ గారబ్బాయి సినిమాలో నటించాడు.
అయితే నాగార్జున హీరోగా మొదట సక్సెస్ అందుకున్న సినిమా ఆఖరి పోరాటం. 12 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా శ్రీదేవి నటించింది. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో చేసిన గీతాంజలి సినిమా కూడా నాగ్ కు మంచి హిట్ ను అందించింది. ఇంకా చెప్పాలంటే గీతాంజలి సినిమా నాగార్జునకు లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.
గీతాంజలి తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా కూడా నాగార్జునకు భారీ విజయాన్ని కట్టబెట్టింది. ఈ రెండు సినిమాల సక్సెస్‌లు నాగార్జునను టాలీవుడ్ లోని స్టార్ హీరోల సరసన నిలబెట్టేలా చేశాయి. ఆ తర్వాత మాస్ పరంగా కూడా సత్తా చాటాలని ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ లాంటి సినిమాలు చేశాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో నాగార్జున చేసిన నిన్నే పెళ్లాడుతా ఆ రోజుల్లో భారీ విజయాన్ని అందుకుంది.
తర్వాత అన్నమయ్య సినిమా చేసి మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డును గెలుచుకున్న నాగార్జున, ఆ సినిమాలో అన్నమయ్యగా తన నటనతో విమర్శకులను సైతం మెప్పించగలిగాడు. దాని తర్వాత శ్రీరామదాసులో రామదాసు పాత్రను కూడా అంతే గొప్పగా పోషించి వావ్ అనిపించిన నాగ్, షిర్డీ సాయి సినిమాలో సాయి బాబాగా నటించి అదే స్థాయిలో ఆకట్టుకున్నాడు.
ఇవి కాకుండా కింగ్ లాంటి కామెడీ సినిమాలతో పాటూ రాజన్న లాంటి డిఫరెంట్ సినిమాలు, మాస్, శివమణి లాంటి మాస్ సినిమాలు, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి లాంటి ఎమోషనల్ సినిమాలు కూడా చేసి ఆడియన్స్ మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాగార్జునను చూసి ఈ తరం నటులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. కేవలం ఒక తరహా కథలకే పరిమితం కాకుండా ప్రతీ జానర్ లోనూ నాగ్ సినిమాలు చేసి మెప్పించాడు.
కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా కూడా నాగార్జున మంచి పేరు సంపాదించుకున్నాడు. విక్రమ్ సినిమా రిలీజై నేటికి 39 ఏళ్లు అవుతున్న సందర్భంగా నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి నేటికి 39 ఏళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్లలో నాగార్జున సక్సెస్‌లు, బ్లాక్‌బస్టర్లు, సూపర్ హిట్లతో పాటూ ఫ్లాపులు అందుకున్నప్పటికీ ఎప్పటికప్పుడు నటుడిగా కష్టపడుతూనే ఉన్నాడు. ఈ తరం హీరోలకు నాగార్జున జర్నీ, అతను చేసిన సినిమాలు ఎంతో స్పూర్తిదాయకం. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తో కలిసి కుబేర అనే సినిమాతో పాటూ, రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
