నో అంటే టీ తాగి వెళ్తా అన్నాడు : నాగార్జున
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ కుబేర, కూలీ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By: Tupaki Desk | 17 Jun 2025 2:53 PM ISTటాలీవుడ్ కింగ్ నాగార్జున సోలో హీరోగా గత ఏడాది 'నా సామిరంగా' సినిమాతో వచ్చాడు. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో ఇప్పటి వరకు సోలో హీరోగా కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. కానీ నాగార్జున రెండు సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో ఒకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమా కాగా, మరోటి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'కూలీ'. ఈ రెండు సినిమాలు సైతం తమిళ హీరోలు నటించినవి కావడం విశేషం. ధనుష్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన కుబేర సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. తప్పకుండా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
కుబేర సినిమా ప్రమోషన్స్ కోసం గత రెండు వారాలుగా నాగార్జున పలు మీడియా సమావేశాలకు, ఇంటర్వ్యూలకు హాజరు కావడంతో పాటు ఆడియో విడుదల కార్యక్రమం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా పాల్గొన్నాడు. కుబేర సినిమాలోని తన పాత్ర గురించి ఎక్కువ రివీల్ చేయకుండా తప్పకుండా ఆకట్టుకుంటుంది అనే విశ్వాసంను వ్యక్తం చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో నాగార్జున పాత్ర ఏంటి, లుక్ ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ వచ్చింది. కుబేర సినిమాలో ధనుష్ పాత్రకు ఏ స్థాయిలో ప్రాముఖ్యత ఉంటుందో అదే స్థాయిలో నాగార్జున పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ కుబేర, కూలీ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాగార్జున మాట్లాడుతూ... కూలీ సినిమా కథను చెప్పడానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ వచ్చాడు. ఆ సమయంలో మీకు విలన్‌గా నటించడానికి అభ్యంతరం ఉందా అని అడిగాడు. మీకు నచ్చక పోతే మనం ఒక కప్పు టీ తాగి వెళ్లి పోదాం అన్నాడు. విలన్ పాత్ర విషయంలో పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో ఆ కథ విన్నాను. ముందుగానే కథ పాత్ర నచ్చకుంటే టీ తాగి వెళ్లి పోదాం అన్నాడంటే అతడు ఎంత పాజిటివ్‌గా ఆలోచించాడో అర్థం చేసుకోవచ్చు. నాగార్జునను సైతం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించేందుకు ఒప్పించాడు అంటే కచ్చితంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాను సాలిడ్ కంటెంట్‌తో రూపొందించి ఉంటాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కూలీ సినిమా షూటింగ్ సమయంలో చాలా సార్లు దర్శకుడు లోకేష్ కనగరాజ్ నాతో పులిలా నడవండి సార్ అనేవాడు. కూలీ సినిమాలో తన పాత్రకు కుబేర సినిమాలోని నా పాత్రకు చాలా తేడా ఉంటుందని అన్నాడు. అంతే కాకుండా రెండు పాత్రలకు ఎక్కడ కూడా పోలిక ఉండదని చెప్పుకొచ్చాడు. లోకేష్ కనగరాజ్‌కి శేఖర్ కమ్ములకు చాలా వ్యత్యాసం ఉందని అన్నాడు. కొన్ని సార్లు శేఖర్ మీరు సింపుల్‌గా నటించండి చాలు, అతిగా నటించనక్కర్లేదు అనేవాడు అని నాగార్జున చెప్పుకొచ్చాడు. రెండు సినిమాలు కూడా నాగార్జున అభిమానులకు చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఈ ఏడాదిలో నాగ్ నటించిన సోలో హీరో సినిమాలు లేవు కనుక ఈ సినిమాలు రెండు ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
నాగార్జున ఈ రెండు సినిమాల తర్వాత కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా హిట్ చిత్రాల ప్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పటికే కథ చర్చలు పూర్తి అయ్యాయని, కుబేర సినిమా విడుదల తర్వాత ఆ సినిమా పట్టాలెక్కే విధంగా నాగ్ ప్లాన్ చేశారట. 2026 సమ్మర్‌లో తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కోసం నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. అదే సమయంలో అఖిల్‌తో ఒక మల్టీస్టారర్ సినిమాను నాగ్ చేస్తాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.