కింగ్ నాగార్జున 100వ చిత్రం: జూలై 10 తర్వాత సస్పెన్స్‌కు తెర!
టాలీవుడ్ సీనియర్ స్టార్, కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను పట్టాలెక్కించేందుకు సర్వం సిద్ధం చేశారు.
By: Sivaji Kontham | 6 July 2026 9:04 AM ISTటాలీవుడ్ సీనియర్ స్టార్, కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను పట్టాలెక్కించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని అక్కినేని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని నటించిన `లెనిన్` చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో నాగార్జున స్వయంగా ఈ సినిమా అప్‌డేట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 10న `లెనిన్` థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో... జూలై 10 తర్వాతే తన 100వ సినిమా వివరాలను అధికారికంగా వెల్లడిస్తానని నాగార్జున ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్కంఠ రెట్టింపయింది.
యాంకర్ సుమ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జునను 100వ సినిమా గురించి ప్రశ్నించగా.. ఆయన ఎంతో సింపుల్‌గా సమాధానమిస్తూ అసలు విషయాన్ని దాటవేశారు. ప్రస్తుతం తన దృష్టి అంతా అఖిల్ సినిమా విడుదలపైనే ఉందని.. అందుకే జూలై 10వ తేదీ గడిచిన తర్వాతే తన ల్యాండ్‌మార్క్ మూవీ అప్‌డేట్ ఇస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే సోషల్ మీడియా, వెబ్ మాధ్యమాల్లో ఈ సినిమా గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నా.. కింగ్ స్వయంగా టైమ్ ఫిక్స్ చేయడంతో జూలై 10 తర్వాత రానున్న అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.
టెంపరరీగా #King100 లేదా లాటరీ కింగ్ అనే వర్కింగ్ టైటిల్స్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమా..యాక్షన్ - ఫ్యామిలీ డ్రామా నేపథ్యంతో కూడిన ఒక అద్భుతమైన కథాంశంతో తెరకెక్కుతోంది. ఒక సాధారణ వ్యక్తి శూన్యం నుండి కోటీశ్వరుడిగా ఎదిగే క్రమంతో పాటు... తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ సీనియర్ నటి టబు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున- టబు కాంబినేషన్ వెండితెరపై పునరావృతం కానుండటం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. దీనికి తోడు అక్కినేని అభిమానులకు కంటి నిండా విందు ఇచ్చేలా నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్ అక్కినేని ఇద్దరూ ఈ సినిమాలో ప్రత్యేక కేమియో పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి ముగ్గురి కలయికలో వచ్చిన క్లాసిక్ హిట్`మనం` తరహాలోనే.. ఈ 100వ సినిమాలోనూ అక్కినేని ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో సందడి చేసేలా ఒక ప్రత్యేకమైన సీన్‌ను ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
కేవలం ఒక్క సినిమా (నిథం ఒరు వానమ్) అనుభవం ఉన్న దర్శకుడితో నాగార్జున తన 100వ సినిమా చేస్తుండటంపై కొందరు ఫ్యాన్స్ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా.. అతడు వినిపించిన కథలోని వైవిధ్యం కారణంగా ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ అయింది. ఇటీవల `కూలీ` వంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్, డార్క్ క్యారెక్టర్స్ చేసిన నాగార్జున.. ఈ మైల్‌స్టోన్ మూవీతో మళ్లీ పవర్‌ఫుల్ హీరో రోల్‌లోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పటికే గతేడాది అక్టోబర్ 5న ఈ సినిమా ముహూర్తపు పూజా కార్యక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా జరుపుకోగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే షూటింగ్ శరవేగంగా సాగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ సహా షూటింగ్ కి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కింగ్ నాగార్జున బృందం జూలై 10 తర్వాత ప్రకటించే వరకూ వేచి చూడాల్సిందే.
