కింగ్ @100 మైసూర్ లో అందుకే ప్లాన్ చేసారా?
కింగ్ నాగార్జున 100వ చిత్రం ప్రతిష్టాత్మకంగా తమిళ దర్శకుడు `రా` కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 28 Feb 2026 8:00 PM ISTకింగ్ నాగార్జున 100వ చిత్రం ప్రతిష్టాత్మకంగా తమిళ దర్శకుడు `రా` కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్న పూర్ణ స్టూడియోస్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. 100వ సినిమా అని నాగార్జున కథ విషయంలో నేల విడిచి సాము చేయలేదు. మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లోనే మెప్పించనున్నారు. అయితే ఆ కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాయింట్ నచ్చడంతోనే రా కార్తిక్ కు దర్శకుడిగా పెద్దగా అనుభవం లేనప్పటికీ ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లోనే ప్రారంభమైంది.
ఇప్పటికే అక్కడ రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది. తాజాగా మళ్లీ కొత్త షెడ్యూల్ కూడా అక్కడే ప్రారంభమైంది.
దీంతో మైసూర్ లో ఎక్కువగా భాగం షూటింగ్ ప్లాన్ చేసారని తెలుస్తోంది. హైదరాబాద్ సహా ఇండియాలో ఎన్నో లొకేషన్స్ ఉన్నా? మైసూర్ లోకే ఎందుకంత ప్రాధాన్యత అంటే చాలా విషయాలే కనిపిస్తున్నాయి. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. కథలో కీలక భాగం పాతకాలపు భవనాలు, పచ్చని ప్రకృతి , ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రాంతంలో జరగాల్సి ఉందిట. మైసూర్ నగరంలో గల చారిత్రక కట్టడాలు , వింటేజ్ లుక్‌కు పెట్టింది పేరు .
ఈ నేపథ్యంలో కథలోని సహజత్వం కోసం దర్శకుడు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మైసూర్ అన్నది నాగార్జునకు ఓ లక్కీ ఎమోషన్ కూడా. అక్కడ షూటింగ్ చేస్తే తన సినిమాలు మంచి విజయం సాధిస్తాయని నమ్ముతారు. ఆ కారణంగానూ షూటింగ్ ప్లాన్ చేసినట్లు చెప్పొచ్చు. ఇక గత సినిమాల విషయానికి వస్తే? నాగార్జున నటించిన `సోగ్గాడే చిన్ని నాయన`, `బంగార్రాజు` సినిమాల షూటింగ్స్ మైసూర్‌లోని 1500 ఏళ్ల క్రితం నాటి పురాతన దేవాలయాల్లో జరిగాయి. రా కార్తీక్ సినిమాలో కూడా కొన్ని ఆధ్యాత్మిక , సెంటిమెంట్ దృశ్యాల కోసం మైసూర్‌లోని చారిత్రక ఆలయాల్లో షూటింగ్ చేస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన `మనం` షూటింగ్ లో కొన్ని కీలక సన్నివేశాల్ని మైసూర్ లోనే చిత్రీక రించారు. తాజా సినిమాలో నాగార్జున పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, రాజసంగా ఉంటుందని టాక్. మైసూర్‌లోని లలిత మహల్ ప్యాలెస్ వంటి ప్రదేశాలు ఇటువంటి పాత్రల ఎలివేషన్‌కు , గ్రాండ్‌నెస్ ఇవ్వడానికి ఉపయోగ పడతాయి. ఇలాంటి కారణాలెన్నో కింగ్ సెంచరీని మరోసారి మైసూర్ వరకూ తీసుకెళ్లాయి.
