Begin typing your search above and press return to search.

బన్నీ- నాగబాబు ఇష్యూ.. శుభం కార్డు ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం వెళ్తారని వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   17 May 2024 8:45 AM GMT
బన్నీ- నాగబాబు ఇష్యూ.. శుభం కార్డు ఎప్పుడు?
X

ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సినీ గ్లామర్ బాగా కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలు మరింత హీటెక్కాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో ఆయనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగింది. నాగబాబు ఇప్పటికే పార్టీలో ఉన్నారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్ పవన్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ ఎన్నికల కొద్దిరోజుల ముందు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ప్రచారం చివరి రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరు సతీమణి సురేఖ, అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లి మరీ పవన్ ను కలిశారు. ఆ సమయంలో బాబాయ్, అబ్బాయ్ ఒకే చోట కనిపించి ఫ్యాన్స్ లో జోష్ నింపారు.

అయితే చిక్కంతా అల్లు అర్జున్ తోనే వచ్చింది. పోలింగ్ కు కొద్ది రోజుల ముందు తన మద్దతు పవన్ మామయ్యకు ఎప్పుడూ ఉంటుందని ట్వీట్ చేశారు బన్నీ. ఆ తర్వాత తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి విషెస్ తెలపడానికి నంద్యాల వెళ్లారు. దీంతో పెద్ద రచ్చ మొదలైంది. ఎందుకంటే.. శిల్పా రవి వైసీపీ తరఫున బరిలో దిగారు. అంతకుముందు ప్రచారంలో భాగంగా శిల్పా రవి.. పవన్, నాగబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో బన్నీ పర్యటనను పవన్ ఫ్యాన్స్ తప్పుపట్టారు.

ఇంతలో మావాడు పరాయివాడు అంటూ నాగబాబు చేసిన ట్వీట్ మరింత అగ్గి రాజేసింది. బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. అప్పటికీ పోలింగ్ రోజు.. ఓటు వేసిన అనంతరం అల్లు అర్జున్ తాను నంద్యాల వెళ్లడంపై పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. తాను అందరికీ మద్దతిస్తానని తెలిపినా.. నెట్టింట చర్చ ఆగలేదు. ఇక నాగబాబు.. రీసెంట్ గా తన ఎక్స్ (అప్పటి ట్విట్టర్) అకౌంట్ ను డీ-యాక్టివేట్ చేశారు. జనసేన ఫుల్ జోష్ లో ఉన్న టైమ్ లో నాగబాబు ఇలా చేయడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు.

అయితే మరికొద్ది రోజుల్లో అల్లు అర్జున్.. పుష్ప-2 మూవీ థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ ఇష్యూ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందేమోనని కొందరు అంటున్నారు. అయితే పుష్ప-2కు ఎలాంటి ఇబ్బంది ఉండదని, కానీ ఈ వివాదానికి శుభం కార్డు పడేలా ఎవరైనా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తానికి బన్నీ పర్యటన, నాగబాబు ట్వీట్ ఇష్యూ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి.